Let's talk: editor@tmv.in
రేవంత్‌ సీఎం పదవి 2028 వరకే: ఎంపీ ఈటల రాజేందర్‌

రేవంత్‌ సీఎం పదవి 2028 వరకే: ఎంపీ ఈటల రాజేందర్‌

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవి 2028 వరకే ఉంటుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే నాయకులు చరిత్రలో నిలవలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రి గతంలో ఉండి ఉంటే అడ్డగుట్ట, వారాసిగూడ వంటి బస్తీలు ఏర్పడేవి కావని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించడంతో ఆయనకు దిమ్మతిరిగిందని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యకు, ధరణిలో భూముల నమోదుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 22ఏ భూముల అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, డివిజన్‌ అధ్యక్షులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, సెల్‌ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ముఖ్య నాయకులతో శామీర్‌పేటలోని తన నివాసంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సచివాలయం వద్ద బీజేపీ నేతల అరెస్ట్‌పై మండిపాటు

అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని తెలంగాణ సచివాలయం వద్ద అరెస్టు చేయడాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్యకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని విమర్శించారు. మూడు రోజుల్లోనే రెండోసారి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని ఈటల అన్నారు. నిరసన తెలిపే హక్కును అడ్డుకున్నా బీజేపీ భయపడదని, విద్యార్థుల భవిష్యత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రేవంత్‌ సీఎం పదవి 2028 వరకే: ఎంపీ ఈటల రాజేందర్‌ - Tholi Paluku