Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డిది ‘బ్లాక్‌మెయిల్ రాజకీయం’: కొండా సురేఖ

రేవంత్ రెడ్డిది ‘బ్లాక్‌మెయిల్ రాజకీయం’: కొండా సురేఖ

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. తనను కేబినెట్‌ నుంచి తప్పించేందుకు ఆయన ‘బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు’ పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం తనను తొలగించాలనే ఉద్దేశంతో లేదని, అయితే తాను మంత్రివర్గంలో కొనసాగితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ రేవంత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొన్నారు.

మంత్రివర్గం నుంచి తనను తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ప్రకటించిన కొద్దిసేపటికే సురేఖ మీడియాతో మాట్లాడారు. తనను తొలగించే ముందు వివరణ ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా మంత్రివర్గం నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు.

నన్ను తొలగించాలని అధిష్ఠానం అనుకోలేదు

తన తొలగింపుపై సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి 100 శాతం ఉద్దేశం లేదు. కానీ, నేను కొనసాగితే తాను సీఎం పదవిలో ఉండనంటూ ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. తనను ఎందుకు తొలగించారో ఇప్పటివరకు ఎలాంటి కారణం చెప్పలేదని అన్నారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ, నన్ను మాత్రం కనీసం సమాచారం ఇవ్వకుండా, వివరణ కోరకుండా తొలగించారని సురేఖ వ్యాఖ్యానించారు.

మంత్రి పదవి కోల్పోయినప్పటికీ తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. మంత్రి పదవి తమకు కేవలం అలంకారం వంటిదేనని, గతంలోనూ తానే స్వయంగా పదవికి రాజీనామా చేసిన సందర్భం ఉందని గుర్తుచేశారు. అయితే, ఎలాంటి కారణం చెప్పకుండా, ముందస్తు సమాచారం లేకుండా తొలగించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.

కుమార్తె వ్యాఖ్యలే కారణమా?

సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలపై చేసిన విమర్శలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే సురేఖను కేబినెట్‌ నుంచి తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ అన్నారు.

తన కుమార్తె స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలను తాను ఖండిస్తే తన కుమార్తెను తక్కువ చేసినట్లవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల మనుస్మృతి, పితృస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సుస్మిత కూడా తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా వ్యక్తం చేసిందని తెలిపారు.

కుట్ర వెనుక పలువురు నేతలు

తనపై జరిగిన పరిణామాల వెనుక రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం. నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సోదరులు ఉన్నారని సురేఖ ఆరోపించారు. తనతో పాటు తన ఓఎస్డీని కూడా లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందని పేర్కొన్నారు. తనపై ప్రతీకార ధోరణితోనే చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తాను, తన భర్త వెనుకబడిన తరగతులకు చెందినవారమని, రాజకీయాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. ప్రజల మద్దతు తమకు కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సురేఖ పేర్కొన్నారు. అయితే వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలపైనా సురేఖ స్పందించారు. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం ఉంటుందని సీఎం చేసిన ప్రకటనపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీసీ మహిళా మంత్రిగా తనకు అన్యాయం

తాను బీసీ మహిళా నాయకురాలినని, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా తనను కేబినెట్‌ నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని సురేఖ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు తానే క్రెడిట్‌ ఇస్తున్నారని, అలాంటి సమయంలో బీసీ మహిళా మంత్రిని తొలగించడం సరైన నిర్ణయమా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఇప్పటికే చర్చనీయాంశంగా మారిందని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలో తన తొలగింపు అంశం కూడా ఢిల్లీలోని ఏఐసీసీపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌ తరహా రాజకీయ కమ్యూనికేషన్‌ లేదు

మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో రేవంత్‌రెడ్డిని పోల్చిన సురేఖ.. ప్రస్తుత ముఖ్యమంత్రికి వైఎస్సార్‌కు ఉన్న రాజకీయ కమ్యూనికేషన్‌ లేదని విమర్శించారు. ప్రజలు, పార్టీ నేతలతో రాజకీయంగా మరింత సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వచ్చే ఏడాది కూడా ఆయనకు రాఖీ కడతారా అని మీడియా ప్రశ్నించగా, ‘‘ఎందుకు కట్టకూడదు?’’ అని సురేఖ సమాధానమిచ్చారు.

సోనియాతో పాటు అగ్రనేతలకు లేఖలు

ఇదిలా ఉండగా, తనపై జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలకు తాను రాసిన లేఖలను సురేఖ మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. సోనియాగాంధీకి రాసిన లేఖలో.. తాను బీసీ మహిళా మంత్రిగా ఉన్నప్పటి నుంచే సీఎం రేవంత్‌రెడ్డి తనపై ‘అణచివేత చర్యలకు’ పాల్పడుతున్నారని సురేఖ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా వచ్చిన అనేక ఆదేశాల కారణంగా మంత్రిగా తన పాత్ర దాదాపు నామమాత్రంగా మారిపోయిందని పేర్కొన్నారు.

తనపై జరుగుతున్న రాజకీయ, పరిపాలనా అణచివేతపై సోనియాగాంధీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు. కేబినెట్‌ నుంచి తన తొలగింపు నేపథ్యంలో సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

రేవంత్ రెడ్డిది ‘బ్లాక్‌మెయిల్ రాజకీయం’: కొండా సురేఖ - Tholi Paluku