Let's talk: editor@tmv.in
రేవంత్ కుటుంబం బాగుపడుతుంటే కేటీఆర్ ఎందుకు ఓర్వలేకపోతున్నారు?: ఎంపీ చామల

రేవంత్ కుటుంబం బాగుపడుతుంటే కేటీఆర్ ఎందుకు ఓర్వలేకపోతున్నారు?: ఎంపీ చామల

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కుటుంబం సంపాదించుకుంటుంటే కేటీఆర్ ఎందుకు ఓర్వలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్కువ పెట్టుబడులతో కుటుంబ సభ్యులు చిన్నచిన్న కంపెనీలు ఏర్పాటు చేసుకుంటే కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తమ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన కేసీఆర్, 1,600 మంది బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో తన కుటుంబంలోని ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. అమెరికా నుంచి వచ్చి కేటీఆర్ మంత్రి అయ్యారని, హరీష్ రావు కూడా అలాగే పదవులు పొందారని గుర్తుచేశారు. దీనికి భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎవరూ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాలేదని అన్నారు. తన ఐదుగురు అన్నదమ్ములకు పదవులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పాలనలో మాదిరిగా కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టలేదని స్పష్టం చేశారు.

అందరికీ కేటాయించే విధానంలో భాగంగానే రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారని, నిబంధనల ప్రకారం భూమి కేటాయించారని తెలిపారు. తక్కువ పెట్టుబడితో కంపెనీలు ఏర్పాటు చేసుకుంటూ కుటుంబ సభ్యులు బతకాలని చూస్తే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు కట్టబెట్టారో, ఏ ఏ దోస్తుల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చారో తమ దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. కుటుంబంలో పంపకాలు తేడా రావడం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని, దానిపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఇకనైనా కేటీఆర్ నిరాధార వ్యాఖ్యలు మానుకోవాలని చామల హితవు పలికారు.

రేవంత్ కుటుంబం బాగుపడుతుంటే కేటీఆర్ ఎందుకు ఓర్వలేకపోతున్నారు?: ఎంపీ చామల - Tholi Paluku