
రెవెన్యూ మంత్రిని బర్తరఫ్ చేయాలి: రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ
తెలంగాణలో సెక్షన్ 22ఏ దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సెక్షన్ 22ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నిబంధన మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు ఉపయోగించేందుకు కాదని హరీశ్ రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22ఏ జాబితాలో చేర్చి వేధిస్తున్నారని ఆరోపించారు.
నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు దళారులు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని, ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో భూ యజమానులపై 50:50 జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలకు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22ఏలో చేర్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
2023 డిసెంబర్ నుంచి 22ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన భూములపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి భూముల చేర్పులు, తొలగింపులు, మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై నిజాలు వెలికితీయాలని కోరారు. జిల్లాల వారీగా 22ఏ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
