
రెండోసారి సీబీఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్
తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో టీవీకే (టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ను సీబీఐ సోమవారం రెండోసారి విచారించింది. న్యూఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. విజయ్‌ను గతంలో జనవరి 12న కూడా సీబీఐ ఆరు గంటల పాటు విచారించింది. జనవరి 13న మళ్లీ హాజరు కావాలని సీబీఐ కోరగా, పొంగల్ పండుగ కారణంగా మరో తేదీ కోరినట్లు అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం సుమారు 10:20 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన విజయ్, సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీబీఐ కార్యాలయం బయట ఉన్న టీవీకే పార్టీ నేత సీ.టి. నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేము దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాం. కరూర్ ఘటనపై అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. కరూర్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి ఎంపీలు అక్కడికి వెళ్లారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కూడా అక్కడి పరిస్థితిని వివరించారన్నారు.దర్యాప్తు సంస్థలతో మేము పూర్తిగా సహకరిస్తున్నాం. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. విజయ్‌ను మళ్లీ పిలవలేదని ఆయన తెలిపారు.
సమగ్రంగా విశ్లేషిస్తాం
సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం విజయ్‌ను విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు, విజయ్ ప్రసంగం ఆలస్యమవడానికి కారణాలు, గందరగోళం కొనసాగుతున్నప్పటికీ ప్రసంగాన్ని కొనసాగించడంపై తీసుకున్న నిర్ణయం, ఆ సమయంలో పరిస్థితులపై ఆయనకు ఉన్న అవగాహన, హాజరైన జనసంఖ్య, గుంపు నిర్వహణలో జరిగిన లోపాలపై సీబీఐ ప్రశ్నలు వేసినట్లు తెలిపారు. నటుడు విజయ్, ఆయన పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నేతలు, ర్యాలీకి అనుమతులు ఇచ్చిన, భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, జిల్లా పరిపాలనా అధికారుల వాంగ్మూలాలను సమగ్రంగా విశ్లేషించిన తరువాతే చార్జ్‌షీట్‌లో వ్యక్తుల పాత్రను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.
ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి సీబీఐకి బదిలీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు, ఈ కేసు దర్యాప్తును చేపట్టేందుకు సీబీఐ డైరెక్టర్ ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది. అలాగే, దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం, ఈ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్లో తీవ్రమైన ప్రభావం చూపిందని వ్యాఖ్యానించింది. ఇది పౌరుల ప్రాణాలతో సంబంధం ఉన్న తీవ్రమైన విషయం అని, బాధిత కుటుంబాల మౌలిక హక్కులను కాపాడటం అత్యంత కీలకమని పేర్కొంది. క్రిమినల్ న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి రావాలి. అది సాధించడానికి ఈ కేసులో దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పక్షపాతం లేకుండా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
