
రూ.50 లక్షలకు ఇళయ‘రాజీ’
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్ పై వేసిన కాపీరైట్ కేసులను రాజీ చేసుకున్నారు. ‘డ్యూడ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాల్లో తన పాటలను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ దాఖలు చేసిన సివిల్ సూట్ పై మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్పందించింది.
చెన్నై హైకోర్టులో జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఎదుట రెండు వర్గాలు హాజరై, చర్చల అనంతరం రాజీ కుదిరినట్టు తెలిసింది. ఇళయరాజా, మైత్రీ మేకర్స్ ప్రతినిధి డిజిటల్ సంతకాలు చేసిన కామన్ కాంప్రమైజ్ మెమోను కోర్టుకు సమర్పించారు.
రాజీ నిబంధనల ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ ఇళయరాజాకు రూ.50 లక్షలు చెల్లించింది. 10 శాతం టీడీఎస్ తగ్గించి మిగిలిన మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తం వాటా అందగానే ‘డ్యూడ్’ సినిమాలో తన పాటలను వాడుకునేందుకు అనుమతి లభిస్తుందని, కానీ అజిత్ చిత్రం అయిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో మాత్రం ఆ పాటలను పూర్తిగా తొలగించాలని రాజీలో భాగంగా అంగీకరించారు.
ఈ రాజీ మెమోను పరిశీలించిన న్యాయమూర్తి, దీనికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంటూ కేసును రాజీ ప్రకారం పరిష్కరించినట్టు ఆదేశించారు. రెండు పక్షాలు తమ తమ ఖర్చులు స్వయంగా భరించుకోవాలని స్పష్టం చేశారు.
గత నెల 26న ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్లో ‘నూరు వర్షం’, ‘కరుత మచ్చాన్’ పాటలను అనుమతి లేకుండా మార్చి, వక్రీకరించి వాడారని ఆరోపించారు. తన నైతిక హక్కులు దెబ్బతిన్నాయని, రాయల్టీ హక్కు ఉన్నప్పటికీ ఉల్లంఘించారని వాదించారు.
మైత్రీ మూవీ మేకర్స్ తరపు వాదించిన సీనియర్ న్యాయవాది పీ.వీ.బాలసుబ్రహ్మణ్యం మాత్రం, కాపీరైట్ చట్ట సవరణకు ముందు రచించిన సంగీతం కాబట్టి నిర్మాతే రచయితగా కొనసాగుతాడని, సోనీ మ్యూజిక్ నుంచి హక్కులు కొనుగోలు చేశామని వాదన వినిపించారు.
నవంబర్ 28న తాత్కాలిక నిషేధం విధించిన కోర్టు, ఈ బుధవారం రాజీతో కేసును ముగించింది. సెప్టెంబర్ ఎనిమిదిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో మరో మూడు పాటలపై కూడా తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో, ఈ రాజీతో రెండు సినిమాల వివాదం పరిష్కారమైంది.
