Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం నెలకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం నెలకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
6 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం నెలకు సగటున రూ.1,000 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వ ఉద్యోగులు ఒక దీక్షలా భావించి పూర్తి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో, మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని చెప్పారు.

ఒక ఉద్యోగి పదవీ విరమణకు సంబంధించి ప్రభుత్వం సుమారు రూ.1 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని సీఎం వెల్లడించారు. దీంతో నెలకు దాదాపు రూ.1,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహిస్తూ చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.

పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పన్నుల వసూళ్లలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం పరిమితంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం, పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి భూమి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి పెద్దగా భూములు అందుబాటులో లేవని చెప్పారు.

సామాజికంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలంటే విద్యే ప్రధాన మార్గమని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలు, తండాలు సహా పేద ప్రాంతాల ప్రజలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నాణ్యమైన విద్యను అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.

మాదిగ ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, విద్యా, సామాజిక రంగాల్లో మరిన్ని సంస్కరణలు చేపడతామని సీఎం పేర్కొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే పేదలకు అన్యాయం

ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే చివరి పేదవాడి వరకు సంక్షేమ ఫలాలు చేరుతాయని సీఎం చెప్పారు. ప్రగతి ప్రణాళికలో ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఒకరోజు అలసత్వం వల్ల పది దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి కళ్లూ చెవులూ, అలాగే బ్రాండ్ అంబాసిడర్లని ఆయన అభివర్ణించారు.

వర్గీకరణలో దేశానికే ఆదర్శం

దళితుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతిలోపు మాదిగల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం అనేక పోరాటాలు జరిగాయని సీఎం గుర్తుచేశారు. రాజకీయ ఒత్తిడులు వచ్చినా తాను మాదిగలకు అండగా నిలిచానని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

ఈ సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్గీకరణ ద్వారా లభించిన చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం నెలకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku