Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి: లేళ్ల అప్పిరెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి: లేళ్ల అప్పిరెడ్డి

Panthagani Anusha
19 జనవరి, 2026

పాల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మండ సల్మాన్ దారుణ హత్యకు గురికావడంపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు డీజీపీకి రాసిన లేఖ రాశారు వైసీపీ నేతలు. కాగా ఈ విషయమై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణ భయంతో గత కొంతకాలంగా స్వగ్రామానికి దూరంగా ఉంటున్న సల్మాన్, అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు గ్రామానికి వచ్చిన తరుణంలో ప్రత్యర్థులు మాటువేసి ఇనుప రాడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. అత్యంత క్రూరంగా జరిగిన ఈ హత్య రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. దళితులకు రక్షణ కరువైందని, తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలన కాదు, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని ఆయన ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, సల్మాన్ హత్య ఈ హింసాత్మక రాజకీయాలకు పరాకాష్ట అని జగన్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి అరాచకత్వాన్ని ప్రోత్సహించడం తగదని జగన్ హితవు పలికారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి రావడం నేరమా అని ప్రశ్నిస్తూ, హత్య చేయడమే కాకుండా బాధితుడిపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కొంతమంది పోలీసు అధికారుల అండతోనే టీడీపీ నేతలు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని ఈ రాజకీయ హింసకు ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్ హెచ్చరించారు. బాధితుడి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

డీజీపీ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల ధర్నా

ఇదిలా ఉండగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని చట్టం తన పని తాను చేయడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. పల్నాడు జిల్లాలో హత్యకు గురైన దళిత కార్యకర్త మాండా సల్మాన్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కార్యాలయం బయటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అదనపు డీజీపీ (ఏడీజీ) వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. సల్మాన్ హత్య ముమ్మాటికీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన హత్యేనని ధ్వజమెత్తారు. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లిన సమయంలో సల్మాన్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. కనీసం మృతదేహాన్ని చూడటానికి అనుమతించలేదు. జగన్ గారు స్వయంగా వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటే తప్ప పోలీసులు కదలలేదు అని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, మృతుడిపైనే కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు.

అంత్యక్రియలకు ఆధార్ కార్డులా?: కాసు మహేష్ రెడ్డి

రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా టీడీపీ నేతల చట్టం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సల్మాన్ కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా అడ్డంకులు సృష్టించారని, శ్మశానానికి వెళ్లాలంటే ఆధార్ కార్డులు చూపించాలని డిమాండ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పోలీసులు, డీజీపీ కార్యాలయానికి వచ్చిన ప్రతినిధులను అవమానించారని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి: లేళ్ల అప్పిరెడ్డి - Tholi Paluku