
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు
రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆరోగ్యం, పశుపోషకుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పశువులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఈ శిబిరాలు కొనసాగుతాయని ప్రభుత్వం చేపట్టిన ఈ పశువులకు కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ చికిత్సలు, నట్టల నివారణ మందులు, పశు బీమా,సాధారణ చికిత్సలతో పాటు అవగాహన సమావేశాలు కూడా నిర్వహిస్తారు. రైతులు తమ పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అదేవిధంగా పశుపోషణను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటిస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. పశువులకు నాణ్యమైన మేత అందించేందుకు రూ.52 కోట్లతో 50 శాతం రాయితీపై పశుదాణా అదేవిదంగా రూ.28.32 కోట్లతో 75 శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు పశువుల అకస్మిక మరణం సంభవించినప్పుడు రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా 85 శాతం రాయితీతో కూడిన పశుబీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో పశుపోషణ రంగం సాధించిన ప్రగతిని వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం, గొర్రెలు-మేకల సంఖ్యలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని యార్లగడ్డ పేర్కొన్నారు. పశుపోషణలో ఆధునికతను ప్రోత్సహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 58,440 గోకులాల షెడ్లు నిర్మించామని వచ్చే ఏడాదిలో మరో 50,000 షెడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కుదేలైన ఈ రంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చి రైతుల ఆదాయం పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
