
రాయలసీమ కరువులో అల్లాడుతోంది.. ప్రభుత్వం గాఢనిద్రలో ఉంది: వైసీపీ
రాయలసీమను తీవ్ర కరువు పరిస్థితులు వెంటాడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. రైతులకు సాగునీరు, తాగునీరు, పశువులకు మేత అందక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన వారు.. రాయలసీమలో ఖరీఫ్ సాగు కేవలం 39–40 శాతానికే పరిమితమైందని, భూగర్భ జలాలు 12–20 మీటర్ల మేర పడిపోయాయని తెలిపారు. పచ్చిమేత కొరత కారణంగా పాల ఉత్పత్తి సైతం దాదాపు 75 శాతం తగ్గిపోయిందని పేర్కొన్నారు.
కరువుపై ముందస్తు ప్రణాళిక ఏది?
ఎల్‌నినో, వర్షపాత లోటుపై ముందుగానే హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. తెలంగాణ శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి కోసం దాదాపు 53 టీఎంసీల నీటిని విడుదల చేసిందని, రాయలసీమలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్నా ఏపీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియంగా సుమారు రూ.8,600 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీగా రూ.11 వేల కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరువుతో పంటలు ఎండిపోతున్నా రైతులే బీమా ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించాలి
మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చని, కానీ వృథా అయిన నీటిని తిరిగి తీసుకురాలేమని అన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు సుమారు 160 టీఎంసీలకు పడిపోయిన నేపథ్యంలో, విద్యుదుత్పత్తి కోసం నిరంతరం నీటిని విడుదల చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు, హంద్రీ-నీవా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. శ్రీశైలం నుంచి తెలుగు గంగ, హంద్రీ-నీవా, తాగునీటి పథకాలు, ఇతర రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా కనీసం 30–40 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించాలని కోరారు. విద్యుదుత్పత్తి కోసం నీటి విడుదలను వృథా చేయకుండా నియంత్రించాలని, కరువుతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, పశువులకు మేత, ప్రజలకు తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైనా చంద్రబాబు పాత విధానాన్నే అనుసరిస్తున్నారని జగన్ ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని, కోటా కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు.
