
రాజస్థాన్‌లో ఓటర్ల తొలగింపునకు బీజేపీ కుట్ర
రాజస్థాన్‌లో ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి మోసపూరితంగా తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హత్యను తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ల తొలగింపునకు ఉపయోగించిన ఫారమ్‌లపై ఫోరెన్సిక్ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటాస్రా, అసెంబ్లీ ప్రతిపక్ష నేత టికారం జుల్లీతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 45 లక్షల మంది ‘లేరు, వేరే చోటుకు వెళ్లారు లేదా మరణించారు’గా గుర్తించారని తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు జనవరి 15 వరకు గడువు ఇచ్చారని అన్నారు.
బీఎల్ సంతోష్ సమావేశం తరువాతే
జనవరి 3 వరకు ఎలాంటి గందరగోళం లేదు. వ్యవస్థ సజావుగా నడిచింది. కానీ జనవరి 3న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత విభాగం) బీ.ఎల్.సంతోష్ రాజస్థాన్‌కు వచ్చి సమావేశం నిర్వహించిన తర్వాతే ఓట్లను అక్రమంగా చేర్చడం, తొలగించడం ప్రారంభమైందని దోటాస్రా ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి పొందిన గణాంకాలను వెల్లడిస్తూ డిసెంబర్ 17 నుంచి జనవరి 14 మధ్య కాలంలో, బీజేపీకి చెందిన 937 బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏస్) ద్వారా 211 ఓట్లను చేర్చేందుకు, 5,694 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 110 బీఎల్ఏస్ ద్వారా 185 ఓట్లను చేర్చేందుకు, కేవలం రెండు ఓట్లను తొలగించేందుకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
గడువు ఎందుకు పొడగించారు?
ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు గడువును ఎన్నికల కమిషన్ జనవరి 19 వరకు పొడిగించింది. తొలుత ఈ గడువు జనవరి 15తో ముగియాల్సి ఉంది. ఈ గడువు పొడిగింపుపై కూడా కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి కాంగ్రెస్ భావజాలానికి చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు గడువు పొడిగిస్తాయని మేము ముందే అనుమానించాం. అదే జరిగిందని దోటాస్రా తెలిపారు. జున్జునులో ఒకే రోజులో 13,882 ఫారం–7 దరఖాస్తులు, మండావాలో 16,276, ఉదయ్‌పూర్‌వాటిలో 1,241, ఖేత్రిలో 1,478 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 1.40 లక్షల ఫారమ్‌లు నమోదైనట్లు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య హత్య. దీన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని దోటాస్రా స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, ఏ ఒక్క చెల్లుబాటు అయ్యే ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 13న రాష్ట్రాన్ని సందర్శించి ముఖ్యమంత్రి నివాసంలో బస చేశారని, జనవరి 3 నుంచి 13 మధ్యకాలంలో రహస్య ఆపరేషన్ జరిగినట్లు ఆరోపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల నకిలీ కంప్యూటరైజ్డ్ ఫారమ్‌లు ముద్రించారు. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిపించి, జనవరి 13, 14, 15 తేదీల్లో వేలాది ఫారమ్‌లను ఓటర్ల పేర్ల తొలగింపునకు పంపిణీ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ భావజాలానికి చెందిన వారితో పాటు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారి పేర్లను తొలగించేందుకు కూడా ఫారమ్‌లు పంపిణీ చేశారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ జాబితా విడుదల తర్వాత ఒక బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) రోజుకు గరిష్ఠంగా 10 ఫారమ్‌లు మాత్రమే పంపిణీ చేయాలి. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అభ్యర్థులు వేలాది ఫారమ్‌లను బీఎల్వో నకిలీ సంతకాలతో ప్రతి ఎస్డీఎంకు సమర్పించారని చెప్పారు. పలువురు బీఎల్వోలు మీడియా ముందుకు వచ్చి, ఆ ఫారమ్‌లపై తమ సంతకాలు లేవని, అవి నకిలీవని, అసంపూర్తిగా ఉన్నాయని వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు
ఈ అంశంపై ఎన్నికల కమిషన్ అధికారి నవీన్ మహాజన్‌ను కలిసి, మొత్తం మోసాన్ని వివరించినట్లు దోటాస్రా చెప్పారు. ఉద్యోగాలు పోతాయన్న బెదిరింపులతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, ఓటు దోపిడీ చేయాలనే బీజేపీ ప్రయత్నం ఇది. ఇది వ్యవస్థను స్పష్టంగా దుర్వినియోగం చేయడమే అని దోటాస్రా విమర్శించారు. ఇదివరకూ కాంగ్రెస్ ఇదే తరహా ఆరోపణలు చేయగా, బీజేపీ వాటిని నిరాధారమని కొట్టిపారేసింది. ఈ సమావేశంలో టికారం జుల్లీ మాట్లాడుతూ రాజస్థాన్‌లో ఉపయోగించిన అన్ని ఫారమ్‌లపై ఫోరెన్సిక్ విచారణ జరపాలని ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టును నేను డిమాండ్ చేస్తున్నాను. అవి ఎక్కడ ముద్రించారు? ఎవరు తెచ్చారు? అన్నది బయటపడాలని అన్నారు.
