
రాక్ ఈగిల్ గుడ్ల కోసం నెల రోజులు క్వారీ పనులు నిలిపివేత: పర్యావరణ పరిరక్షణకు అడుగు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో మానవీయ కోణంలో తీసుకున్న పర్యావరణ అనుకూల నిర్ణయం ఇది. అరుదైన రాక్ ఈగిల్ జాతికి చెందిన పక్షి తన ఐదు గుడ్లను పొదగడానికి వీలుగా, ఆ ప్రాంతంలోని ఒక రాయి క్వారీలో సుమారు నెల రోజుల పాటు పనులను పూర్తిగా నిలిపివేశారు. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌లు ఈ విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా అటవీ అధికారులు, క్వారీ యజమాని సహకారంతో, గుడ్లు పగిలిపోకుండా, పక్షి సంతానోత్పత్తికి భంగం కలగకుండా ఈ కీలక చర్యను చేపట్టారు.
వివరాల్లోకి వెళితే, పర్యావరణ అనుకూలమైన చర్యలో భాగంగా, అరుదైన పక్షి అయిన రాక్ ఈగిల్ గుడ్లు పొదగడానికి వీలుగా, తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని ఒక రాయి క్వారీలో సుమారు ఒక నెల రోజులు క్వారీ పనులను నిలిపివేశారు.
పక్షి, గుడ్లు ఉన్నట్లు వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌లు, సంరక్షకులు అప్రమత్తం చేయడంతో తెలంగాణ అటవీ శాఖ త్వరగా రంగంలోకి దిగింది. వికారాబాద్ జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ గురువారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ విఠపు మనోజ్ కుమార్, సుమారు ఆరు రోజుల క్రితం వికారాబాద్‌లోని యెన్కతాల వద్ద గడ్డి భూములను సందర్శించి, రాక్ ఈగిల్, దాని ఐదు గుడ్లు ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) సి సువర్ణకు తెలియజేశారని చెప్పారు. పీసీసీఎఫ్ వెంటనే వికారాబాద్ జిల్లా అటవీ అధికారులను భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, రాయి క్రషింగ్ యూనిట్ యజమాని లక్ష్మారెడ్డికి అరుదైన పక్షి జాతి గుడ్లు ఉన్న విషయాన్ని తెలియజేశారు. పిల్లలు ఎగిరిపోయేంత వరకు పక్షిని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి యూనిట్ యజమాని అంగీకరించారు. నాటి నుండి అటవీ శాఖ సిబ్బంది ప్రతిరోజూ పక్షిని నిశితంగా గమనిస్తున్నారు అని జ్ఞానేశ్వర్ తెలిపారు.
కీటకాలు, ఎలుకలు, ఇతరులపై వేటాడుతూ జీవించే రాక్ ఈగిల్ ప్రధానంగా ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇతర గుడ్లగూబలతో పోలిస్తే, ఇది రాతి ప్రాంతాలలో నివసిస్తుందని ఆయన చెప్పారు. "ఇది అంతరించిపోతున్న జాతి కానప్పటికీ, ఇది అరుదైన జాతి. దీనిని చూడటం చాలా అరుదు" అని ఆ అధికారి తెలిపారు.
యెన్కతాల గడ్డి భూములలో పక్షి ఎప్పుడు గుడ్లు పెట్టిందో తెలియకపోయినా, మరో 15 రోజుల్లో గుడ్లు పొదగడం జరుగుతుందని భావిస్తున్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకుంటే 20-25 రోజుల్లో పిల్లలు ఎగిరిపోతాయని ఆయన చెప్పారు. రాక్ ఈగిల్ గుడ్లు పొదిగి, అవి వెచ్చగా ఉండేలా చూసుకుంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ జాయింట్ సెక్రటరీ కూడా అయిన మనోజ్ , తాను నవంబర్ 30న బర్డింగ్ పర్యటనలో భాగంగా యెన్కతాల గడ్డి భూములను సందర్శించినట్లు తెలిపారు. క్వారీ కొండ, నేల మధ్య ఉన్న గుడ్లను తాను గమనించానని చెప్పారు. అప్రమత్తం చేయడంతో క్వారీలోని ఎర్త్‌మూవర్ డ్రైవర్ తవ్వకాన్ని (రాయి క్రషింగ్‌ను) నిలిపివేశారు.డ్రైవర్, ఇతర సిబ్బందికి పక్షి ఉనికి గురించి తెలుసు.
"మేము ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం ఒక అద్భుతం, ఎందుకంటే అక్కడ నేలపై తవ్వకం జరుగుతోంది. తవ్వకం కొనసాగించి ఉంటే, గుడ్లు నేలపై పడి పగిలిపోయేవి. అక్కడ ఉన్నవారికి గుడ్లు ఉన్న విషయం తెలియదు" అని మనోజ్ అన్నారు. రాక్ ఈగిల్ గుడ్లను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ జంతు కార్యకర్తలు అటవీ శాఖ అధికారులను సంప్రదించారని ఆయన తెలిపారు. అరుదైన పక్షి గుడ్లు ఉన్నట్లు తనకు చెప్పిన తర్వాతే ఆ స్థలంలో పనులను ఆపినట్లు క్వారీ యజమాని చెప్పారు.
రాక్ ఈగిల్ ప్రత్యేక లక్షణాలు
రాక్ ఈగిల్ అనేది పెద్ద గుడ్లగూబ, సుమారు 50-55 సెం.మీ (20-22 అంగుళాలు) పొడవు ఉంటుంది. దీని శరీర రంగు ముదురు పసుపు-గోధుమ ఈకలతో కూడి ఉంటుంది. ఈ ఈకలపై నలుపు, గోధుమ బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని ముఖ్య లక్షణం ఏమిటంటే, దీని తలపై రెండు ప్రముఖమైన ఈకల కుచ్చులు ఉంటాయి, ఇవి కొమ్ముల్లా కనిపిస్తాయి. అందుకే దీనికి కొమ్ముల గుడ్లగూబ అని కూడా పేరు వచ్చింది. దీని కళ్లు పెద్దవిగా, గుండ్రంగా ఆకర్షణీయమైన పసుపు-నారింజ రంగులో ఉంటాయి. ఈ కళ్లు రాత్రిపూట వేటాడటానికి బాగా సహాయపడతాయి. ఆహారం విషయానికి వస్తే, ఇది ప్రధానంగా ఎలుకలు, పందికొక్కులు, పక్షులు, సరీసృపాలు, కీటకాలు వంటి వాటిని వేటాడుతుంది. ఇతర గుడ్లగూబల మాదిరిగానే, ఇవి కూడా రాత్రిపూట చురుకుగా ఉండి వేటాడుతాయి. గుడ్లు పొదగడం కోసం ఇవి సాధారణంగా నేలపై, రాళ్ల మధ్య లేదా చెట్ల వేర్ల క్రింద గూళ్ళు కట్టుకుని 3 నుండి 5 గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగే సమయం సాధారణంగా 30 నుండి 35 రోజులు ఉంటుంది. వీటి శబ్దం లోతైన, ప్రతిధ్వనించే 'బూ-బూ' లాగా ఉంటుంది.
రాక్ ఈగిల్ అంతరించిపోతున్న జాతి కానప్పటికీ, వాటి ఆవాసాలను పరిరక్షించడం చాలా ముఖ్యం. తెలంగాణలో రాక్ ఈగిల్ ఎక్కువగా కనిపించే ప్రాంతాలు పరిమితంగాఉన్నాయి. రాక్ ఈగిల్స్ ప్రధానంగా రాతి భూములు, గుట్టలు పొదలు దట్టంగా ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. తెలంగాణలో, వికారాబాద్ అడవులు పరిసర ప్రాంతాలు, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రాతి గుట్టలు, దక్కన్ పీఠభూమిలోని రాతి నిర్మాణాలలో ఇవి తరచుగా కనిపిస్తాయి.అలాగే నాగర్‌కర్నూల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతం అంచుల్లో, రాతి కొండలు, గోదావరి-కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని రాతి నిర్మాణాలు, మెదక్ కోట, పాత కోటల శిథిలాల వద్ద లేదా పాడుబడిన భవనాల వద్ద కూడా ఇవి గూడు కట్టుకునే అవకాశం ఉంది.
