Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
రణరంగంగా పశ్చిమాసియా.. ఆగని యుద్ధ జ్వాలలు

రణరంగంగా పశ్చిమాసియా.. ఆగని యుద్ధ జ్వాలలు

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది.. ఎక్కడ చూసినా దాడులతో రణరంగంలా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానంతరం చెలరేగిన యుద్ధ జ్వాలలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా దళాలు ఇరాన్ ఉనికిని దెబ్బతీసేలా ప్రచండ దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా క్షిపణులతో విరుచుకుపడుతోంది. పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఖమేనీ అంతానికి ముందే వ్యూహం

ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చాలా కాలంగా వ్యూహరచన చేస్తోంది. గతేడాది నవంబర్‌లోనే ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో ఖమేనీని హతమార్చాలని నిర్ణయించారు. తొలుత ఈ ఆపరేషన్‌ను 2026 మధ్యలో చేపట్టాలని భావించినప్పటికీ, ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి ముందస్తుగా గత శనివారమే ఈ 'సర్జికల్ స్ట్రైక్' నిర్వహించారు. ఒక సార్వభౌమ దేశాధినేతను వైమానిక దాడిలో మట్టుబెట్టడం అంతర్జాతీయ చరిత్రలో ఇదే తొలిసారి.

టెహ్రాన్ బంకర్లపై బాంబుల వర్షం

తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన 50 యుద్ధ విమానాలు టెహ్రాన్‌లోని నాయకత్వ సముదాయం కింద ఉన్న భూగర్భ సైనిక బంకర్‌పై విరుచుకుపడ్డాయి. ఖమేనీ మరణానంతరం దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్ష్మిస్తున్న కీలక నేతలు ఈ బంకర్‌ను వాడుతున్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), దాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడులతో ఇరాన్ అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైంది.

మంటల్లో డ్రోన్ క్యారియర్

యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భానికి కూడా పాకింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్ నౌకాదళంపై పంజా విసిరాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమాన వాహక నౌక అంత పెద్దదైన ఇరాన్ 'డ్రోన్ క్యారియర్' నౌకను అమెరికా క్షిపణులతో కాల్చివేసింది. ఈ దాడిలో ఆ నౌక పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన సుమారు 30 యుద్ధ నౌకలను అమెరికా ధ్వంసం చేసింది.

అమెరికా క్షిపణి విధ్వంసం

గత 72 గంటల్లో అమెరికా బాంబర్లు ఇరాన్‌లోని 200 లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా భూగర్భంలో దాచిన క్షిపణి కేంద్రాలపై బి-2 బాంబర్లు భారీ బాంబులు వదిలాయి. దీనివల్ల ఇరాన్ క్షిపణి ప్రయోగించే సామర్థ్యం 90 శాతం తగ్గిందని అమెరికా అధికారులు ప్రకటించారు. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా, కొత్తవి తయారు చేయకుండా ఫ్యాక్టరీలను కూడా నాశనం చేస్తున్నారు.

అమెరికా బేస్‌పై ప్రతిదాడి

తమపై జరుగుతున్న దాడులకు ఇరాన్ కూడా దీటుగా ప్రతిదాడులు చేస్తోంది. ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్ (అమెరికాకు ఉన్న అతిపెద్ద స్థావరం) లక్ష్యంగా ఇరాన్ డ్రోన్‌లను పంపింది. అయితే ఖతార్ వైమానిక దళం వీటిని గాలిలోనే కూల్చివేసింది. ఈ ఘటనతో ఖతార్‌లో కాసేపు భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బ్రిటన్ టైఫూన్ జెట్లు రంగంలోకి

మధ్యప్రాచ్యంలో తమ మిత్రదేశాలకు అండగా నిలిచేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రంగంలోకి దిగారు. ఖతార్‌కు అదనంగా నాలుగు 'టైఫూన్' యుద్ధ విమానాలను పంపుతున్నట్లు ప్రకటించారు. తమ ప్రజలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రిటన్ తన సైనిక సామగ్రిని అక్కడ సిద్ధంగా ఉంచింది.

కువైట్‌లో అమెరికా ఎంబసీ క్లోజ్

భద్రతా కారణాల దృష్ట్యా కువైట్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. అక్కడ ఉన్న అమెరికన్ పౌరులు వెంటనే దేశాన్ని వీడాలని లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పశ్చిమాసియా అంతటా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాలన మార్పే అంతిమ లక్ష్యం

ఇరాన్ నుంచి పొంచి ఉన్న అస్తిత్వ ముప్పును శాశ్వతంగా తొలగించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఇరాన్‌లో 'పాలన మార్పు'తోనే ముగుస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజల మద్దతుతోనే ఈ మార్పు రావాలని, అందుకు అవసరమైన పరిస్థితులను ఇజ్రాయెల్ సృష్టిస్తుందని పేర్కొన్నారు. కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా, ఇరాన్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది.

చివరి బుల్లెట్ వరకు పోరాడతాం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ మాట్లాడుతూ, ఈ రక్తపాతానికి అమెరికాదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. ఉప విదేశాంగ మంత్రి ఖతీబ్‌జాదే మాట్లాడుతూ.. "ఇది మా ఉనికికి సంబంధించిన యుద్ధం. మా భూభాగాన్ని ఆక్రమించాలనుకుంటే చివరి సైనికుడు, చివరి బుల్లెట్ వరకు పోరాడతాం" అని హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధిపై స్పష్టత

ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తాము మూసివేయలేదని ఇరాన్ స్పష్టం చేసింది. తాము బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగించబోమని పేర్కొంది. అయితే, తమపై దాడులు ఎక్కడి నుంచి జరిగినా అక్కడి అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.

కుర్దులను రెచ్చగొడుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక కుర్దు దళాలను దాడులకు ప్రేరేపిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లి దాడులు చేయడం అద్భుతమైన విషయమని, దానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ భవిష్యత్తు నాయకత్వాన్ని ఎంపిక చేయడంలో అమెరికాదే కీలక పాత్ర ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఆస్ట్రేలియా నావికుల వివాదం

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను ముంచిన అమెరికా జలాంతర్గామిలో ఆస్ట్రేలియా నావికులు ఉండటం రాజకీయ దుమారం రేపింది. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ దీన్ని ధృవీకరించినప్పటికీ, వారు కేవలం శిక్షణలో భాగంగానే ఉన్నారని, దాడిలో పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని అక్రమ యుద్ధంగా విమర్శిస్తున్నాయి.

చిన్నారుల మృతిపై మిన్నంటిన రోదనలు

ఇరాన్‌లోని మీనాబ్ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160 మందికి పైగా చిన్నారులు మరణించడం ప్రపంచాన్ని కలిచివేసింది. ఈ దాడికి అమెరికా దళాలే బాధ్యత వహించే అవకాశం ఉందని విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరింది.

భారతీయ విమానాల పునఃప్రారంభం

యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది విమానాలు రద్దయ్యాయి. భారత్ నుంచి వెళ్లే విమానాలు పాక్షికంగా పునరుద్ధరించబడినప్పటికీ, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులను సౌదీ, ఒమన్ మీదుగా మళ్లిస్తున్నారు. టికెట్ ధరలు పెరగకుండా ప్రభుత్వం నిఘా ఉంచింది.

ఖతార్‌లోని భారతీయులకు సూచనలు

ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియా మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు వీలుగా ట్రాన్సిట్ వీసాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది.

కుప్పకూలిన అంతర్జాతీయ మార్కెట్లు

యుద్ధ ప్రభావంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం నిలిచిపోయింది. దీనితో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. వాల్ స్ట్రీట్ సహా ఆసియా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే యుద్ధం వెంటనే ఆగిపోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అస్పష్టంగా భవిష్యత్తు

పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో తెలియక ప్రపంచం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇరాన్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుండగా, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దాని అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు శ్రమిస్తోంది. దౌత్య మార్గాలు మూసుకుపోవడంతో ఇక యుద్ధమే ఏకైక మార్గంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

రణరంగంగా పశ్చిమాసియా.. ఆగని యుద్ధ జ్వాలలు - Tholi Paluku