Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సిఎస్ఇ)-2025 ఫలితాలను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జోధ్‌పూర్ ఎయిమ్స్ వైద్య విద్యార్థి అనుజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రాజేశ్వరి సువే ఎం రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. గతేడాది (2024) ఫలితాల్లో మహిళల ఆధిపత్యం కనిపించగా, ఈసారి టాప్-5లో నలుగురు పురుషులు నిలవడం విశేషం.

విజేతల నేపథ్యం ఇదీ..

మెడికల్ సైన్స్‌ను ఐచ్ఛికాంశంగా ఎంచుకున్న అనుజ్ అగ్నిహోత్రి, ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రెండో ర్యాంకర్ రాజేశ్వరి అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లో ఈఈఈ పూర్తి చేసి, సోషియాలజీ సబ్జెక్టుతో ఈ ఘనత సాధించారు. ఇక మూడో ర్యాంకర్ ఆకాన్ష్ ధుల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పట్టా పొందారు. వీరితో పాటు రాఘవ్ జున్‌జున్‌వాలా (4వ ర్యాంకు), ఇషాన్ భట్నాగర్ (5వ ర్యాంకు) టాప్-5లో నిలిచారు. టాప్-25 విజేతల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

కేటగిరీల వారీగా ఎంపికైన వారి వివరాలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1,087 ఖాళీలకు గాను యూపీఎస్సీ మొత్తం 958 మందిని ఎంపిక చేయగా, అందులో 659 మంది పురుషులు, 299 మంది మహిళలు (వీరిలో 42 మంది దివ్యాంగులు) విజయం సాధించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. జనరల్ కేటగిరీలో 317 మంది, ఓబీసీలో 306, ఎస్సీలో 158, ఈడబ్ల్యూఎస్‌లో 104, ఎస్టీ విభాగంలో 73 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే మరో 258 మంది అభ్యర్థులను వెయిటింగ్ లిస్ట్ (రిజర్వ్ జాబితా)లో ఉంచారు.

కఠిన పరీక్ష.. సుదీర్ఘ ప్రయాణం

2025 మే 25న జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 9.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 5.76 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14,161 మంది ఆగస్టులో జరిగిన మెయిన్స్ (రాత పరీక్ష)కు అర్హత సాధించగా, వారి నుంచి వడపోత ద్వారా కేవలం 2,736 మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరగా అన్ని దశల్లో నెగ్గి తుది జాబితాలో 958 మంది అభ్యర్థులు కొలువులు సాధించి విజేతలుగా నిలిచారు.

"సివిల్స్ విజేతలందరికీ అభినందనలు. దేశ సేవలో మీరు గొప్ప ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. విజయం సాధించని వారు నిరాశ చెందవద్దు, ఈ ప్రయాణంలో మీరు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మీకు మార్గనిర్దేశం చేస్తాయి" అని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ అన్నారు.

వైవిధ్యమైన విద్యా నేపథ్యాలు

టాప్-25 ర్యాంకర్లు ఐఐటీలు, ఎయిమ్స్, ఎన్‌ఎల్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యనభ్యసించిన వారు ఉన్నారు. వీరు ఇంజినీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, లా, మెడికల్ సైన్స్, మాస్ మీడియా వంటి విభిన్న రంగాల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. అలాగే ఆప్షనల్స్ విషయానికొస్తే సోషియాలజీ, ఎకనామిక్స్, ఆంత్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులకు అభ్యర్థులు మొగ్గు చూపారు. అభ్యర్థుల మార్కులను ఫలితాలు ప్రకటించిన 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కమిషన్ తెలిపింది. ఏవైనా సందేహాలు ఉంటే యూపీఎస్సీ క్యాంపస్‌లోని ఫెసిలిటేషన్ కౌంటర్ ద్వారా లేదా ఫోన్ నంబర్లు 23385271/ 23381125 ద్వారా సంప్రదించవచ్చు.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే!

యూపీఎస్సీ- 2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 30 మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ కొలువులకుఎంపికయ్యారు. ముఖ్యంగా జశ్వంత్ చంద్ర జాతీయ స్థాయిలో 23వ ర్యాంకుతో మెరవగా, పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వీరితో పాటు శ్రీగిరిరాజు వి.పి.ఎస్ సాయికృష్ణ (125), కొలిపాక శ్రీకృష్ణ సాయి (150), భానోత్ లక్ష్మీ రచన (178), డీఎస్‌కే ప్రచేత్‌ (193), ఎస్. వర్షిత్ రెడ్డి (259), ఎం.పవన్ కుమార్ రెడ్డి (297) అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వ 'అభయహస్తం' పథకం ద్వారా శిక్షణ పొందిన వారిలో 20 మంది విజయం సాధించడం విశేషం.

మరికొందరు తెలుగు తేజాలు కూడా తమ ప్రతిభతో ఈ అత్యున్నత కొలువులను సొంతం చేసుకున్నారు. వెలిమినేటి విక్రమసింహారెడ్డి (541), గుమ్మల శ్వేత (573), పల్లి ప్రమోద్‌ విష్ణు (640), ఏ. ఆశిష్ (676), వెలిమినేటి విజయసింహారెడ్డి (682), పోతుపురెడ్డి భార్గవ్‌ (738), పుడారి రాహుల్‌ (748), కుమ్మరి శ్రవణ్‌కుమార్‌ (768), అనిరుధ్‌ కత్తిమాని (786), డి. ప్రవీణ్ (793), కోరపోతుల శ్రీకర్‌రాజు (806), ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష (823), కట్టా ప్రత్యూష (908), గోగుల రాజశేఖర్‌ (920), గుగులోతు జితేందర్‌ నాయక్‌ (939) తదితరులు ర్యాంకుల జాబితాలో నిలిచారు.

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - Tholi Paluku