Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల

Panthagani Anusha
1 మార్చి, 2026

రాష్ట్రంలో అమలవుతున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (యూహెచ్ సీ)పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా పేరుతో ప్రభుత్వం ప్రజలను పచ్చి మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల పాలిట సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ట్రస్ట్ విధానానికి తూట్లు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం ట్రస్ట్ విధానంలో ఎంతో సమర్థవంతంగా నడుస్తోందని షర్మిల గుర్తుచేశారు. ప్రైవేట్ బీమా కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం యూహెచ్‌సీని అమలు చేస్తోంది. ఇతర రాష్ట్రాలన్నీ బీమా కంపెనీలను కాదని ట్రస్ట్ విధానం వైపు మొగ్గు చూపుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ఆమె నిలదీశారు. ప్రైవేట్ బీమా కంపెనీల కండిషన్లతో పేదలపై అదనపు భారం పడుతుందని ఇది ప్రభుత్వ బాధ్యత నుండి తప్పుకోవడమేనని విమర్శించారు.

బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం ఎందుకు?

అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రాని ప్రభుత్వం ప్రైవేటు బీమా కంపెనీలకు వేల కోట్ల రూపాయలను ఎలా ధారపోస్తుందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలు అందించడానికి వెనకాడుతున్నాయని దీనివల్ల సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

రూ. 2.5 లక్షల వరకు బీమా ఆపై ఖర్చును ట్రస్ట్ భరిస్తుందన్న ప్రభుత్వ ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదని షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ అనేది కేవలం పథకం కాదు అది పేదవాడి ప్రాణభరోసా దానిని ప్రైవేట్ బీమాతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి" అని ఆమె డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందించాలని పేదలకు ఉచిత వైద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆమె స్పష్టం చేశారు.

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల - Tholi Paluku