
యూకే నుంచి భారత్‌కు 16వ శతాబ్దపు ఆళ్వార్ విగ్రహం
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న 16వ శతాబ్దానికి చెందిన తిరుమంగై ఆళ్వార్ కంచు విగ్రహంను తిరిగి భారత్‌కు తీసుకువచ్చి తమిళనాడులోని సౌందరరాజ పెరుమాళ్ దేవాలయంలో ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర విగ్రహాన్ని తిరిగి తన అసలు పూజాస్థలానికి చేర్చడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
వైష్ణవ సంప్రదాయంలోని పన్నెండు ఆళ్వార్ సంతులలో అత్యంత గౌరవనీయులైన తిరుమంగై ఆళ్వార్ భక్తి ఉద్యమంలో విశిష్ట స్థానం పొందారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఆయన రచించిన భక్తి గీతాలు నాలాయిర దివ్య ప్రబంధంలో భాగమై వైష్ణవ భక్తి సంప్రదాయానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయని తెలిపారు. ఈ విగ్రహం తిరిగి దేవాలయానికి చేరడం తమిళనాడు ప్రజలకు, భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా మరో నాలుగు పురాతన పురావస్తువులు కూడా భారత్‌కు అప్పగించబడిన విషయం హర్షణీయమని ఉపరాష్ట్రపతి తన పోస్టులో తెలిపారు. ఈ చర్యలు భారతదేశపు నాగరికతా వారసత్వాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి 600కుపైగా పురావస్తువులు భారత్‌కు తిరిగి తీసుకువచ్చినట్లు పేర్కొంటూ, ఇది కేంద్ర ప్రభుత్వ “వికాస్ భీ - విరాసత్ భీ” లక్ష్యానికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పురాతన సంపదను తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, సంబంధిత సంస్థల కృషిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంలో,ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భారతదేశపు చారిత్రక, సాంస్కృతిక సంపదను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎక్స్ ద్వారా ప్రశంసించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీనిని భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన విజయంగా పేర్కొంది.
