
యుద్ధం వేళ మానవత్వం.. 204 మంది ఇరాన్ నావికులకు శ్రీలంక ఆశ్రయం
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, శ్రీలంక తీరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాంకేతిక లోపంతో సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఇరాన్ యుద్ధ నౌక 'ఐరిన్స్ బుషెహర్'లోని 204 మంది నావికులను శ్రీలంక నౌకాదళం సురక్షితంగా కొలంబో తీరానికి తరలించింది. రెండు రోజుల క్రితమే అమెరికా జరిపిన టోర్పెడో దాడిలో ఇరాన్ నౌక 'ఐరిస్ దేనా' సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో, తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
మానవతా దృక్పథంతోనే రక్షణ చర్యలు
నౌకలోని ఇంజిన్ విఫలం కావడంతో సాయం చేయాలని ఇరాన్ కోరినట్లు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే శుక్రవారం వెల్లడించారు. "యుద్ధ సమయంలో మేము తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నాం. అయితే మానవతా దృక్పథంతో ప్రాణాలను కాపాడటం మా బాధ్యత. ప్రతి ప్రాణం మాకు విలువైనదే" అని ఆయన స్పష్టం చేశారు. నౌకలో మొత్తం 208 మంది ఉండగా (53 మంది అధికారులు, 84 మంది క్యాడెట్లు, 48 మంది సీనియర్ నావికులు, 23 మంది సీమెన్), నలుగురు మాత్రం నౌకను పర్యవేక్షించేందుకు అక్కడే ఉన్నారని, మిగిలిన వారిని వెలిసరలోని నౌకాదళ క్యాంపునకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని నౌకాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ తెలిపారు.
మార్చురీల్లో నిండిన శవాలు.. గాలెలో దయనీయ స్థితి
అమెరికా జరిపిన దాడిలో మునిగిపోయిన ఇరాన్ నౌక 'ఐరిస్ దేనా'కు సంబంధించిన విషాదకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. గాలె తీరంలో లంక నావికాదళం ఇప్పటివరకు 84 మృతదేహాలను వెలికితీసింది. అయితే మృతుల సంఖ్య 90 దాటడంతో గాలెలోని కరపిటయ ఆసుపత్రి మార్చురీ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక మృతదేహాలను ఐస్ ముక్కలు, రంపపు పొట్టు మధ్య తాత్కాలికంగా భద్రపరుస్తున్నారు. ఈ మృతదేహాలను ఇరాన్‌కు పంపే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
విశాఖ నుంచి వస్తుండగా ఘోరం
భారతదేశంలోని విశాఖపట్నంలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఇరాన్ నౌక ‘ఐరిస్ దేనా’పై దాడులు జరగడం గమనార్హం. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభించడంతో గల్ఫ్ ప్రాంతమంతా యుద్ధక్షేత్రంగా మారింది. ఈ క్రమంలోనే శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జలాంతర్గామి ఇరాన్ నౌకను ముంచేసింది.
రాజకీయాలు వద్దు.. ఒత్తిడికి తలొగ్గం
ఈ సున్నితమైన అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూడటం సరికాదని అధ్యక్షుడు దిసనాయకే మండిపడ్డారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, కేవలం ఒక దేశం చేసిన అభ్యర్థన మేరకు ప్రాణాలను కాపాడటం వరకే తమ పాత్ర పరిమితమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం బుషెహర్ నౌకను తూర్పున ఉన్న త్రికోణమలీ పోర్టుకు తరలించేందుకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
