Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొంగులేటి

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
1 మార్చి, 2026

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరను అందరం సమన్వయంతో పట్టుదలతో విజయవంతం చేశామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆయన సహచర మంత్రి సీతక్కతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం రూ.251 కోట్ల నిధులతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జంపన్న వాగు, హరిత, ఊరట్టం, చిలకల గుట్ట, ఆర్‌టీసీ జంక్షన్ ప్రాంతాలను సందర్శించి, తుది దశకు చేరుకున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరకు ముందే సుమారు 95 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 5 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

జనవరిలో జరిగిన మేడారం జాతరకు సుమారు 1.55 కోట్ల మంది భక్తులు విచ్చేసినట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, మీడియా సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను ప్రణాళికాబద్ధంగా నిర్వహించగలిగామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

రెండేళ్లకోసారి జరిగే జాతరను దృష్టిలో పెట్టుకొని కాకుండా, 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని రీతిలో రాతి నిర్మాణాలు పూర్తి చేశామని ఆయ‌న‌ చెప్పారు. అభివృద్ధి చెందిన మేడారాన్ని సందర్శించేందుకు ఇకపై శని, ఆదివారాలు సెలవు దినాల్లో కూడా భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని వెల్లడించారు.

జంపన్న వాగుకు గోదావరి జలాలు

జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా గోదావరి నీటిని తీసుకురావాలని ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి విడతగా ఐదు చెక్‌డ్యాంల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని, రెండు ఇరిగేషన్ ట్యాంకులను సుందరీకరించనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య నివారణకు 29 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని, అవసరమైతే మరింత భూమి సేకరిస్తామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు.

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొంగులేటి - Tholi Paluku