

మెడిపల్లిలో కల్తీ మసాలాల గుట్టురట్టు.. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి అక్రమంగా లాభాలు ఆర్జించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. ఆమె ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై మెరుపుదాడి నిర్వహించాయి.
విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం రంపపు పొడి (సా డస్ట్) కలిపినట్లు వెల్లడైంది. ప్రముఖ బ్రాండ్లను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి ఉత్పత్తులను మార్కెట్‌లోకి పంపుతున్నట్లు గుర్తించారు.
దాడిలో 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 10,890 కిలోలు (10.89 టన్నులు) మసాలా పదార్థాలను సీజ్ చేయగా, వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ, ప్యాకింగ్‌కు ఉపయోగించే ముడి పదార్థాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రిని కూడా పరిశీలించారు. ఈ కేసులో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు.
కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగుతుందని సుమతి తెలిపారు. వినియోగదారులు ప్యాకెట్ రూపాన్ని మాత్రమే చూసి కొనుగోలు చేయకుండా బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలను పరిశీలించాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై అనుమానం ఉంటే 8712662111 నంబర్‌కు సమాచారం అందించాలని ఆమె కోరారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
