
మూసీ నిర్వాసితులను అనాథలను చేయం: సీఎం రేవంత్ రెడ్డి
మారుతున్న కాలానికి అనుగుణంగా హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బుద్వేల్ లేఅవుట్‌ను కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు శంకుస్థాపన చేసి, కొత్వాలగూడలో ఎకో పార్క్, బర్డ్స్ ఏవియరీని ప్రారంభించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాధలుగా వదిలే ప్రసక్తే లేదని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మూసీ రివర్ ను శుభ్రపరచి రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. రివర్ ఫ్రంట్ చుట్టూ రాత్రి వేళల్లో వ్యాపార అవకాశాలు కల్పించి నైట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారు.
అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. నిర్వాసితులు ఇబ్బంది పడకుండా వేరే చోట భూమి కొనుగోలు చేసుకునే స్థాయిలో నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భవిష్యత్తులో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులు నిర్మాణానికి భూసేకరణ అవసరమని, అభివృద్ధి కోసం కొన్ని త్యాగాలు తప్పవని సీఎం అన్నారు.
హైదరాబాద్ - గ్లోబల్ హబ్
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్‌లో సబర్మతీ,ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్ తరహాలో హైదరాబాద్‌ను కూడా అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో శంషాబాద్ ప్రాంతాన్ని బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా మార్చేందుకు దాదాపు అన్ని అనుమతులు వచ్చినట్లు చెప్పారు. బెంగళూరు, చెన్నై, పుణె, అమరావతి నగరాలకు శంషాబాద్ నుంచే రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
అభివృద్ధిలో భాగస్వామ్యం
గతంలో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా కొందరికి ఇబ్బంది కలిగిందని, కానీ నేడు అదే విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారిందని సీఎం గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను విరమించి, నగరాన్ని ప్రపంచంలోనే గొప్పదిగా తీర్చిదిద్దే యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
