
మున్సిపల్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్న కేబినెట్
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ చారిత్రక సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్ మెట్రో విస్తరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం
రాష్ట్రంలో పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించింది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఇప్పటికే అందడం, రిజర్వేషన్లు ఖరారవడం, ఫిబ్రవరిలో రంజాన్, మహాశివరాత్రి వంటి పండుగలు, విద్యార్థుల పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ఎన్నికలు జరపాల్సిన అవసరాన్ని మంత్రిమండలి స్పష్టం చేసింది.
మేడారం, ములుగు అభివృద్ధి
ఈ సమావేశంలో మేడారం అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు రూ.143 కోట్లను మంజూరు చేశారు. అలాగే ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఐదు గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతో పాటు 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.
మేడారం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 19 ఎకరాల భూసేకరణ పూర్తికాగా, మరో 20–21 ఎకరాలు సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన ఆలయాలను ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడం, ఎకో-టూరిజం దృష్టితో కన్సల్టెన్సీ నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు.
మెట్రో రైలు & మౌలిక సదుపాయాలు
అదేవిధంగా హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకోవర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, మెట్రో ఫేజ్–2లో భాగంగా ఏ, బీ విస్తరణలకు భూసేకరణ కోసం రూ.2,787 కోట్లను కేటాయించారు. ఐసీసీసీ నుంచి శిల్పా లే అవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణానికి, నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశానంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క మీడియాకు వివరాలు వెల్లడించారు.
