Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ముంబై ఎయిర్‌పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్‌ కలకలం

ముంబై ఎయిర్‌పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్‌ కలకలం

Panthagani Anusha
20 అక్టోబర్, 2025

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ అధికారులు మరో విజయాన్ని నమోదు చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు శుభ్రతా సిబ్బంది విదేశీ మూలం గల బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా అధికారులు ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసి రూ.1.6 కోట్ల విలువైన 24 క్యారెట్ల బంగారు ధూళిని స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్ పోర్ట్ అంతర్గత సిబ్బందే కీలక పాత్ర

దర్యాప్తు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ స్మగ్లింగ్ గ్యాంగ్‌ అంతర్జాతీయ ప్రయాణికుల సాయంతో బంగారాన్ని విమానాల్లో దాచిపెట్టి, విమానం ల్యాండ్ అయిన తరువాత విమానాశ్రయ సిబ్బందే దానిని బయటకు తీసే రహస్య పద్ధతి ద్వారా రవాణా చేస్తోంది. అయితే ఈ వ్యవహారం గురించి ఖచ్చితమైన సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ అధికారులు శనివారం రాత్రి ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించారు. పర్యవేక్షణ సమయంలో శుభ్రతా బృందంలోని ఒక టీమ్ లీడర్ ఏరోబ్రిడ్జ్ మెట్ల వద్ద అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అధికారులు అతని వద్దకు చేరుకోగానే అతను తన చేతిలో ఉన్న ఒక తెల్లటి ప్యాకెట్‌ను మెట్లపై వదిలి వెళ్ళాడు. ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడగా తెల్ల గుడ్డలో కప్పిన మైనంలో బంగారు ధూళి ఉన్నట్లు బయటపడింది.దీనితో తక్షణమే అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించగా, అతను తన సూపర్‌వైజర్‌ ఆ బంగారం విమానంలో నుంచి తీసి తనకు ఇచ్చినట్లు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా సూపర్‌వైజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం వీరిద్దరిని విచారించగా ఇద్దరూ ఒక ప్రైవేట్‌ క్లీనింగ్‌ సర్వీస్‌ కంపెనీకి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 1.2 కిలోల 24 క్యారెట్ల బంగారు ధూళి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ 1.6 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇక కస్టమ్స్‌ చట్టం ప్రకారం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.

ముంబై ఎయిర్‌పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్‌ కలకలం - Tholi Paluku