
మీసాల పిల్ల పాటను రికార్డును శశిరేఖ బద్దలు కొట్టనుందా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రెండో సింగిల్ ‘శశిరేఖ’తో మరింత బజ్ సృష్టించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే మొదటి పాట ‘మీసాల పిల్ల’ యూట్యూబ్‌లో 75 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు స్థాయిలో ఆదరణ పొందింది. ఈ విజయం రెండో పాటపై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ‘శశిరేఖ’ మరో మధురమైన మెలోడీ అయినప్పటికీ, ఫుట్ ట్యాపింగ్ బీట్స్‌తో కూడిన డాన్స్ నంబర్‌గా రూపొందుతోందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ పాటలో చిరంజీవి తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీతో స్టెప్పులు వేస్తూ కనువిందు చేస్తున్నారు. నయనతార అదిరిపోయే స్టైలిష్ డాన్స్ పోజ్‌తో కనిపించి, ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పోర్ట్ నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కిన ఈ డాన్స్ సీక్వెన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు కనువిందు కానుంది.
ఈ పాట ప్రోమో డిసెంబర్ 06న, లిరికల్ వీడియో డిసెంబర్ 08న విడుదల కానుంది.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రీసెంట్‌గానే విక్టరీ వెంకటేష్ తన భాగం పూర్తి చేసుకున్నారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి చేసే మాస్ డాన్స్ నంబర్ ఈ చిత్రంలో మరో క్రేజీ హైలైట్‌గా మారనుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు.
చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతూ, ఇప్పటి నుంచే తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద విడుదలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది అని అనడం ఎలాంటి సందేహం లేదు.
