
మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
మిల్లు యజమానులు బకాయిపడిన ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన మొత్తాన్ని కచ్చితంగా వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా బకాయిల ఎగవేతకు ప్రయత్నించే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వ్యాపార దృక్పథంతో పారదర్శకంగా మిల్లులు నిర్వహించే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం కల్పించి, ఆ తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి సాధించామని, అయితే ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయిని కూడా వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
బకాయిల వసూళ్లకు స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విధివిధానాలు పూర్తయిన తర్వాత నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సూచించారు. ఉపసంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించి, మిల్లింగ్ బాధ్యతలను వారికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు.
ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ధాన్యం భారీగా వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్‌ల ఏర్పాటును పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాలకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.
అలాగే వీబీ జీ రామ్ జీ ప్రాంతంలో విశాలమైన ప్లాట్‌ఫాంలు నిర్మించి జర్మన్ టెంట్ల ద్వారా ధాన్యం నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలోని ప్రైవేటు గోదాములు, కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి అవసరమైన సమయంలో లీజుకు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి
అనంతరం తెలంగాణలోని గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 9 పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నామని వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్వహణలో చిన్నపాటి సమస్యలేవైనా ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించి వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి భూములకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్‌లో ఉందని సీఎం తెలిపారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారంపై వాస్తవ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. తక్షణ ప్రభావం పడే ప్రాంతాలకు త్వరితగతిన నిధులు విడుదల చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులలో నీటిని నింపే అవకాశం లభిస్తుందన్నారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. అలాగే గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కోసం వెంటనే కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు.
మరోవైపు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల ప్రకారమే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం లేదని సీఎం పునరుద్ఘాటించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ పలు లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి వివరించగా, ఈ విషయమై ఎన్డీఎస్‌ఏతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
