
మార్చి 2027 నాటికి భూ రీ-సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, మార్చి 2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే గృహాల పంపిణీ, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినా ప్రజల అంచనాలకు అనుగుణంగా ఫలితాలు అందాలంటే భూ రీ-సర్వే కీలకమని చెప్పారు.
పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో సుమారు 95 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తామని, తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, విధుల్లో చేరని వారి లైసెన్సులను రద్దు చేయాలని అధికారులకు సూచించారు. రీ-సర్వేలో పాల్గొనే సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చొప్పున పారితోషికం అందజేస్తామని చెప్పారు.
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ధరణి కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి భూ భారతిలో అవకాశం కల్పించినప్పటికీ, అధిక సంఖ్యలో తిరస్కరణలు జరుగుతున్నాయనే అభిప్రాయం ఉందన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, రెండో విడత లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని, ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ పాఠశాలల ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
