
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం: జగన్
ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ నాటకాలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళా సాధికారత గురించి వేదికలపై గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం ప్రధాన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల సమయంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఇచ్చిన 'అడబిడ్డ నిధి' పథకం అమలుపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ వయస్సు వర్గానికి చెందిన మహిళలు సుమారు 1.8 కోట్ల మంది ఉన్నారని వారికి సంవత్సరానికి రూ.18,000 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ లెక్కన మూడు సంవత్సరాల కాలానికి ఒక్కో మహిళకు రూ.54,000 ప్రభుత్వం బాకీ పడిందని ఈ నగదును ఎప్పటి నుంచి జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా అటకెక్కిందని జగన్ మండిపడ్డారు. ఈ పథకాన్ని (దీపం–2) పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ఏటా దాదాపు రూ.4,000 కోట్లు అవసరమని కానీ ప్రభుత్వం మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరానికి కూడా కేవలం రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించడం మహిళలను వంచించడమేనని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఉన్న 1.59 కోట్ల యాక్టివ్ వంట గ్యాస్ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకు రూ.6,143 కోట్లు బకాయి పడిందని జగన్ లెక్కలతో సహా వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందని, మహిళల సంక్షేమం విషయంలో రాష్ట్రం ఇప్పుడు చీకటి దశలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అయితే జగన్ చేసిన ఈ ఆరోపణలపై అధికార పక్షం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు.
