
మళ్లీ గతంలోకి ఎందుకు వెళ్తున్నాం? ప్రజా సమస్యలపై చర్చిద్దాం: ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
తెలంగాణ శాసనసభలో ‘అంటరానితనం’, ‘శుద్ధీకరణ’ అంశాలపై జరుగుతున్న చర్చపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలు గతానికి సంబంధించినవని, సమాజం ఎంతో ముందుకు సాగిన నేపథ్యంలో మళ్లీ వాటి గురించి చర్చించడం ఎందుకని ప్రశ్నించారు.వివిధ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ దృష్టి సారించాలని ఆమె కోరారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. ‘అంటరానితనం’, దళితులపై ‘శుద్ధీకరణ’ వంటి అంశాల గురించి గతంలో విన్నామని, అలాంటి పరిస్థితులు ఎప్పుడో ముగిసిపోయాయని చెప్పారు. సమాజం నూతన ఆలోచనలతో ముందుకు సాగుతోంది. కొత్త తరం వచ్చింది. అలాంటప్పుడు మనం మళ్లీ గతంలోకి ఎందుకు వెళ్తున్నాం? ఈ ఆరోపణలు, గొడవలకు ముగింపు పలికి ప్రతిపక్షాలు ఒక ముగింపునకు రావాలి" అని ఆమె విజ్ఞప్తి చేశారు. గడిచిన మూడు రోజులుగా శాసనసభలో ఎటువంటి నూతన చర్చ జరగలేదని పర్ణికా రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులుగా తమ నియోజకవర్గాల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ ఒక వేదిక అని, అయితే వరుస అడ్డంకుల వల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. యువతరంగా తాము మెరుగైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నామని, సభ సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని కోరారు. స్పీకర్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు పార్లమెంటరీ పరిధి దాటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని, ఒక చిన్న "క్షమాపణ" చెబితే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు.
