
మరోసారి బద్దలైన ‘కిలౌయా’ అగ్నిపర్వతం
అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలో అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలౌయా’ మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వచ్చింది. కిలౌయా శిఖరంలోని దక్షిణ వెంట్ నుండి వెలువడిన లావా ఫౌంటెన్లు దాదాపు 500 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే కూడా ఎత్తైనదని యూరో న్యూస్ నివేదించింది. ఈ లావా ఫౌంటెన్ల పైన ఏర్పడిన వాయువుల దట్టమైన పొగ దాదాపు 5,000 మీటర్లు (5 కి.మీ.) ఎత్తు వరకు వ్యాపించింది.
ఈ అగ్నిపర్వతం నిరంతరాయంగా ఏడున్నర గంటల పాటు అగ్నికీలలతో విరుచుకుపడి హఠాత్తుగా చల్లబడింది. అయితే ఈ అగ్నిపర్వతం రెండు వారాల తర్వాత మరోసారి బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత విస్ఫోటనాలు 1983-86 మధ్యలో పుయుఓఓ విస్ఫోటనం ప్రారంభంలో సంభవించిన ఎపిసోడిక్ లావా ఫౌంటెన్ల మాదిరిగా ఉండటం విశేషం.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఇది సెకనుకు సగటున 6,750 క్యూబిక్ అడుగుల లావాను ఉత్పత్తి చేస్తుందని అంచనా. కాగా ఈ ఏడాది మార్చిలో కూడా రెండుసార్లు ఈ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం డిసెంబర్ నుండి ఇది 35వ సారి కావడం గమనార్హం. అయితే ఈ పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల స్థానికులకు ఎలాంటి ముప్పూ లేదని అధికారులు తెలిపారు.
కిలౌయా అగ్నిపర్వతం గురించి..
కిలౌయా అగ్నిపర్వతం హవాయిలోని బిగ్ ఐలాండ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైన షీల్డ్ అగ్నిపర్వతాలలో ఒకటి. దీన్ని హవాయి అగ్నిపర్వత దేవత పీలే నివాసంగా భావిస్తారు. ఇది 1983 నుండి 2018 వరకు నిరంతరంగా లావాను వెదజల్లింది.
ఇది తరచుగా తన శిఖర కాల్డెరా నుండి లావా ఫౌంటెన్లను ఎగజిమ్ముతూ ఉంటుంది. ఇటీవలి విస్ఫోటనాలలో, లావా వందల మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతోంది. దీని విస్ఫోటనాలు పెద్ద మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఈ అగ్నిపర్వతం నిరంతర క్రియాశీలత కారణంగా దీనిని యూఎస్జీఎస్ (యుఎస్ జియోలాజికల్ సర్వే) జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది.
అతిపెద్ద, పురాతన అగ్నిపర్వతాలు
ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా. ఇది హవాయిలో ఉంది. అతిపెద్ద వాల్యూమ్ (పరిమాణం) గల అగ్నిపర్వతం కూడా ఇదే. ఇక భూమిపై పురాతన అగ్నిపర్వతాలలో ఇటలీలోని ఎట్నా పర్వతం (5,00,000 సంవత్సరాల చరిత్ర) ఉంది.
కొన్ని అగ్నిపర్వతాలు నిరంతరంగా లావాను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇటలీలోని స్ట్రోంబోలి ఒకటి. దీనిని తరచుగా 'మెడిటరేనియన్ దీపస్తంభం' అని పిలుస్తారు. ఎందుకంటే అది దాదాపు నిరంతరంగా స్వల్ప విస్ఫోటనాలను ప్రదర్శిస్తుంది. హవాయిలోని కిలౌయా కూడా 1983 నుండి 2018 వరకు సుదీర్ఘ కాలం పాటు చురుకుగా ఉంది. ఇప్పటికీ తరచుగా విస్ఫోటనం చెందుతూనే ఉంది
నష్టాలు: అగ్నిపర్వత విస్ఫోటనాలు చరిత్రలో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగించాయి. ఉదాహరణకు 2018లో కిలౌయా విస్ఫోటనం కారణంగా హవాయిలో వందల గృహాలు ధ్వంసమయ్యాయి. అలాగే వెసూవియస్ వంటి పురాతన విస్ఫోటనాలు మొత్తం నగరాలనే (పాంపీ) నాశనం చేశాయి. ఇండోనేషియాలోని టంబోరా (1815వ సంవత్సరంలో) విస్ఫోటనంలో వేలాది మంది ప్రజలు నేరుగా మరణించగా, ఆ తర్వాత ఆకలి, వ్యాధుల కారణంగా మొత్తంగా 71,000 మంది వరకు మరణించారు.