Let's talk: editor@tmv.in
భోగాపురం విమానాశ్రయానికి ‘ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్’ హోదా

భోగాపురం విమానాశ్రయానికి ‘ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్’ హోదా

Gaddamidi Naveen
14 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. ఈ విమానాశ్రయాన్ని అధికారిక 'ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్' గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ కొత్త విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకలకు, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సదుపాయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

దేశంలోని అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌ల జాబితాతో కూడిన సెప్టెంబర్ 1, 2025 నాటి నోటిఫికేషన్‌ను సవరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025' లోని సెక్షన్ 4(1) ప్రకారం ఈ సవరణలు చేశారు. గత వారం విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కేటగిరీ-1 (విమానాశ్రయాలు) జాబితాలో భోగాపురం విమానాశ్రయాన్ని 39వ స్థానంలో చేర్చింది.

ఈ చట్టబద్ధమైన గుర్తింపు వల్ల, భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు విదేశాల నుంచి వచ్చే, వెళ్లే ప్రయాణీకుల పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, వీసా తనిఖీలు, ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను నిర్వహించడానికి వీలవుతుంది. ఏదైనా విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సేవలను నడపడానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ గుర్తింపు పొందడం అత్యంత ప్రాథమిక నిబంధన.

ఉత్తరాంధ్ర విమానయాన హబ్ – భోగాపురం

విశాఖపట్నానికి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ పద్ధతిలో అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాయు రవాణా కనెక్టివిటీని మరింత పెంచనుంది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయానికి అదనంగా ఇది ఒక ప్రధాన ఏవియేషన్ హబ్‌గా మారబోతోంది.

ప్రాజెక్ట్ ప్రత్యేకతలు..

ఏటా దాదాపు 4 కోట్లు మంది ప్రయాణీకుల సామర్థ్యంతో ఈ విమానాశ్రయం రూపొందిస్తున్నారు. ఎగిరే చేప ఆకారంలో 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీని టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని లోపలి, వెలుపలి డిజైన్లు ఉత్తరాంధ్ర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అంతర్గత, బాహ్య నిర్మాణాలను రూపొందిస్తూనే, మెట్రో నగరాల విమానాశ్రయాలకు సమానమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయిగా.. గత వారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భోగాపురంలోని 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్' కు ఎయిర్‌డ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది. జూలై 10న న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ లైసెన్స్ పత్రాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ లైసెన్స్ లభించడంతో భోగాపురం విమానాశ్రయం వాణిజ్య విమాన సర్వీసుల నిర్వహణకు సిద్ధమైనట్లు మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
BhogapuramAirportBhogapuramInternationalAirportAndhraPradeshVizianagaramVisakhapatnamNorthAndhraAviationNewsAirportDevelopmentInfrastructure
భోగాపురం విమానాశ్రయానికి ‘ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్’ హోదా - Tholi Paluku