Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం

భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం

Shaik Mohammad Shaffee
19 జనవరి, 2026

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య బంధం మరింత బలోపేతమైంది. సోమవారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో సరికొత్త దిశానిర్దేశం చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో 'వ్యూహాత్మక భాగస్వామ్యం' దిశగా అడుగులు వేయడం ఈ పర్యటనలో హైలైట్‌గా నిలిచింది.

ఘనస్వాగతం.. ఆత్మీయ ఆలింగనం

యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోడీ విమానాశ్రయంలోనే సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరు నేతలు ఒకే వాహనంలో ప్రధాని నివాసానికి చేరుకుని ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ పర్యటన అత్యంత ఫలప్రదంగా ముగిసిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు.

రక్షణ రంగంలో భారీ అడుగు

పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు నెలలకే భారత్-యూఏఈ మధ్య రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదరడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రక్షణ పారిశ్రామిక సహకారం, అధునాతన సాంకేతికతలు, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

ఇంధన భద్రత: 10 ఏళ్ల ఎల్‌ఎన్‌జీ ఒప్పందం

భారత ఇంధన అవసరాల కోసం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసేలా హెచ్‌పీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి పదేళ్ల పాటు ఈ సరఫరా కొనసాగుతుంది. అలాగే సివిల్ న్యూక్లియర్ (అణుశక్తి) రంగంలోనూ సహకారంపై ఇరు దేశాలు ఆసక్తి చూపాయి.

ఆర్థిక లక్ష్యం: 200 బిలియన్ డాలర్లు

ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2032 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇరు దేశాల మధ్య నగదు బదిలీని సులభతరం చేసేలా పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించనున్నారు. దీనివల్ల లావాదేవీలు వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. మరోవైపు భారతీయ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్లకు చేరవేయడానికి 'భారత్ మార్ట్', 'వర్చువల్ ట్రేడ్ కారిడార్' వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా 'భారత్-ఆఫ్రికా సేతు' ద్వారా భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా వ్యూహాలు సిద్ధం చేశారు.

అంతరిక్షం.. టెక్నాలజీ.. ధోలేరా!

కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక రంగాల్లోనూ ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అంతరిక్ష రంగంలో కొత్త లాంచ్ కాంప్లెక్స్‌లు, ఉపగ్రహ తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలను చేపట్టాలని నిర్ణయించాయి. కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటూ భారత్‌లో అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్లు, డేటా సెంటర్ల విస్తరణలో యూఏఈ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, గుజరాత్‌లోని ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం అభివృద్ధిలో యూఏఈ భాగస్వామి కానుంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ టౌన్‌షిప్, రైల్వే కనెక్టివిటీ, ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.

ఉగ్రవాదంపై రాజీలేని పోరు

సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల కట్టడికి ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అలాగే పశ్చిమ ఆసియాలో (గాజా, యెమెన్, ఇరాన్) నెలకొన్న ఉద్రిక్తతలపై కూడా నేతలు చర్చించారు. చివరగా, గిఫ్ట్ సిటీలో డీపీ వరల్డ్, ఫస్ట్ అబుదాబి బ్యాంక్ బ్రాంచీల ఏర్పాటును స్వాగతిస్తూ.. 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్స (ఐఎంఈసీ)ను వ్యూహాత్మక ప్రాజెక్టుగా ఇరు దేశాలు అభివర్ణించాయి.

భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం - Tholi Paluku