
భారత నౌకాదళం అసమాన ధైర్యసాహసాలకు ప్రతీక: ప్రధాని మోడీ
భారత నౌకాదళం అసాధారణ ధైర్యం, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం నౌకాదళ దినోత్సవం సందర్భంగా భారత నౌకాదళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ లో పోస్టు చేసిన సందేశంలో కొన్నేళ్లుగా నౌకాదళం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భరత) ఆధునికీకరణపై దృష్టి పెట్టిందని, దీని వల్ల మన భద్రతా వ్యవస్థ మరింత బలోపేతమైందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రతి ఏటా డిసెంబరు 4న జరుపుకునే నౌకాదళ దినోత్సవం, 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో నౌకాదళం పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తుంది. ఆపరేషన్ ట్రైడెంట్ కింద భారత నౌకాదళ మిస్సైల్ బోట్లు కరాచీ ఓడరేవుపై ధైర్యంగా దాడి చేశాయి.
మన నౌకాదళం బలపడింది
మన నౌకాదళం అసాధారణ ధైర్యం, సంకల్పానికి పర్యాయపదం. తీర ప్రాంతాలను కాపాడటం, సముద్ర మార్గాల్లో మన ప్రయోజనాలను రక్షించడం వారి బాధ్యత. ఇటీవలి సంవత్సరాల్లో స్వయం సమృద్ధి, ఆధునికీకరణపై దృష్టి సారించి దీని ఫలితంగా మన భద్రతా వ్యవస్థ మరింత బలపడింది” అని మోడీ తన పోస్టులో రాశారు. ఈ ఏటి దీపావళిని దేశీయ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నౌకాదళ సిబ్బందితో కలిసి గడిపానని, ఆ అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిదని గుర్తు చేసుకున్నారు.
బుధవారం సాయంత్రం కేరళలోని తిరువనంతపురం తీరంలో జరిగిన నౌకాదళ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కోల్‌కతా వంటి అత్యాధునిక నౌకలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీక్షించారు.రాష్ట్రపతి ఈ సందర్భంగా నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సముద్ర సరిహద్దులను, జాతీయ ప్రయోజనాలను ధైర్యంగా, అప్రమత్తంగా కాపాడే వీరులకు జాతి సలాం చేస్తోంది. వాణిజ్య మార్గాల భద్రత నుంచి మానవతా కార్యక్రమాల వరకు నౌకాదళం క్రమశిక్షణ, కరుణ, బాధ్యతలకు ప్రతీక అని రాశారు.
వీరులెప్పటికీ ప్రేరణే
నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా శుభాకాంక్షలు తెలిపారు. డ్యూటీ, గౌరవం, ధైర్యంతో దేశానికి, నౌకాదళానికి సేవ చేసే ప్రతిజ్ఞ పునరుద్ఘాటిస్తున్నాం. బలగంగా నిలిచి, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా భారత జాతీయ సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. 1971 యుద్ధంలో కరాచీ ఓడరేవుపై జరిగిన ధైర్యసాహసాలను స్మరించుకుంటూ, త్యాగాలు చేసిన వీరులు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని అడ్మిరల్ త్రిపాఠి పేర్కొన్నారు.
