
భయానక అనుభవం… కానీ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం: పీవీ.సింధు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించడంతో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఉద్రిక్తమైన, భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తాము సురక్షితంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులు చేపట్టడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేయగా, దుబాయ్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి.
పేలుడు ఘటన
మార్చి 3 నుంచి ఆల్ ఇంగ్లాడ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పాల్గొనాల్సిన సింధు, శనివారం నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. మా విమానం దిగిన కొద్దిసేపటికే ఎయిర్‌స్పేస్ మూసివేశారు. పైగా మేమున్న ప్రాంతానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో మా కోచ్ సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్నారు. ఆ అనుభవం మమ్మల్ని బాగా కలవరపరిచిందని సింధు తెలిపారు. ఆమె కోచ్ ఇర్వాన్సియా అది ప్రథమ కూడా ఘటనను ధృవీకరించారు. మమ్మల్ని హోటల్‌కు తరలించారు. మేమంతా సురక్షితంగా ఉన్నాం. సింధు మ్యాచ్ బుధవారం ఉంది. వీలైనంత త్వరగా బర్మింగ్‌హామ్ చేరాలని ఆశిస్తున్నామని చెప్పారు.
భారత హైకమిషన్ సహాయం
సింధు, ఆమె సహాయక బృందాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది సహకారం అందించారని చెప్పారు. దుబాయ్‌లోని భారత హైకమిషన్ అధికారులు వెంటనే స్పందించి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర ఆటగాళ్ల పరిస్థితి
బహుళ భారత షట్లర్లు ఇప్పటికే బర్మింగ్‌హామ్ చేరుకున్నారు. అందులో సాత్వికసైరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ షెట్టి జోడీ, లక్ష్య సేన్, అయుష్ షెట్టి, గాయత్రీ గోపిచంద్–త్రీసా జాలీ జోడీ ఉన్నారు. మాళవిక బన్సోడ్ కూడా చేరుకున్నారు. అయితే ఉన్నతి హుడా ఢిల్లీ నుంచి నేరుగా వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో భారత్‌లోనే ఉన్నారు. బీఏఐ (బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ) బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ పరిస్థితిని సమీక్షిస్తూ, ఆటగాళ్ల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని వెల్లడించింది. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో పోటీ షెడ్యూల్లో మార్పులపై కూడా ఆలోచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సింధు సురక్షితంగా ఉన్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలోని జియోపాలిటికల్ ఉద్రిక్తతల ప్రభావం క్రీడా రంగంపైనా పడింది.
