Let's talk: editor@tmv.in
భద్రాద్రి రాముడిపై ఆన.. 2029 ఎన్నికల్లో 117 సీట్లు మావే: సీఎం రేవంత్‌ రెడ్డి
భద్రాద్రి రాముడిపై ఆన.. 2029 ఎన్నికల్లో 117 సీట్లు మావే: సీఎం రేవంత్‌ రెడ్డి

భద్రాద్రి రాముడిపై ఆన.. 2029 ఎన్నికల్లో 117 సీట్లు మావే: సీఎం రేవంత్‌ రెడ్డి

Gaddamidi Naveen
11 జులై, 2026

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2028లో ఎన్నికలు ఉండవని, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత.. మే-జూన్ 2029లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన జోస్యం చెప్పారు. పునర్విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 117కు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ బహిరంగ సభలో రైతులకు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏప్రిల్‌లో వీగిపోయిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఎలాగైనా సరే రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆమోదింపజేసుకోవడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రంపై విమర్శలు

కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి మమతా బెనర్జీ పార్టీని, ఆప్ పార్టీని ఎలా ముక్కలు చేశారో, ఇతర పార్టీలను ఎలా లొంగదీసుకున్నారో చూశాం. బెదిరింపులకు గురిచేస్తూ లేదా ఇతరులను లొంగదీసుకుని తమకు నచ్చినట్లు సీట్లను పెంచేలా ఈ బిల్లును పాస్ చేసుకోవాలని చూస్తున్నారు. వారు చేసే ఈ పాపపు పనిలో ఒకవేళ విజయం సాధించవచ్చు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2028 డిసెంబర్‌లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు కాస్తా, 2029 మే-జూన్ నెలకు మారుతాయని అంచనా వేశారు. పునర్విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని, అలాగే లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

‘ఔర్ ఏక్ బార్ - కాంగ్రెస్ సర్కార్’

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిపై ఆన.. ఖమ్మం గడ్డపై ప్రమాణం చేస్తున్నానని.. పునర్విభజన తర్వాత వచ్చే 182 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 117 స్థానాలు గెలుచుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ లక్ష్య సాధన కోసం తాను, తన పార్టీ నాయకులు రోజుకు 18 గంటలు శ్రమిస్తామన్నారు. గతంలో (జూలై 2023లో) తాను ఊహించినట్లే డిసెంబర్ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలుచుకుందని, ఆ జోస్యం నిజమైందని గుర్తుచేశారు. ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిసి.. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 20 లోక్‌సభ స్థానాలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని మాట ఇస్తానన్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన ‘ఔర్ ఏక్ బార్ - కాంగ్రెస్ సర్కార్’ (మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం) అనే సరికొత్త నినాదాన్ని ఇచ్చారు.

కేసీఆర్ కుటుంబాన్ని 'కౌరవులు' గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఆ కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ పటం నుంచి పూర్తిగా తుడిచిపెట్టే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోరని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ కేటీఆర్ ఓ సర్వేను ఉదహరించడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల తేదీలు, అభ్యర్థులు, రిజర్వేషన్లు, అసలు ఎన్నికల అంశాలేంటో తెలియకుండా సర్వే ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు.

హరీష్ రావుకు సవాల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు బీజేపీతో రహస్య చర్చలు జరుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను బీజేపీలో చేరనని భద్రాద్రి రాముడి సాక్షిగా ప్రమాణం చేయగలరా? అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో ఉన్న రూ.1,400 కోట్ల నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్ల క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవేనని కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం

రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందమే తమ ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదు.. పండుగ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గడిచిన 9 రోజుల్లో రూ. 9,000 కోట్ల మేర 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ చెల్లించిన సందర్భంగా తెలిపారు. ఈ సభా వేదికగా సీఎం రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1009.15 కోట్ల నిధులను విడుదల చేశారు. అలాగే, రైతులకు ‘ఈ-పట్టాదారు పాసుపుస్తకాల’ జారీ కార్యక్రమాన్ని, మొక్కజొన్న రైతుల కోసం రూ. 3,504 కోట్ల నిధుల విడుదలను లాంఛనంగా ప్రారంభించారు.

రూ.1.70 లక్షల కోట్లతో రైతు సంక్షేమం

రైతును రాజును చేయాలన్న ఆలోచనతోనే గడిచిన 30 నెలల్లో ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అక్షరాలా రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఎం వెల్లడించారు. అంటే సగటున ప్రతి నెలా రూ. 5,500 కోట్లు కేవలం రైతుల కోసమే వెచ్చించామన్నారు. ఇందులో రైతు భరోసా (30 నెలల్లో రూ. 36,135 కోట్లు), రుణమాఫీ, బీమా, ఉచిత విద్యుత్, వడ్ల కొనుగోళ్లు (రూ. 80,000 కోట్లు) వంటివి ఉన్నాయి. గత ప్రభుత్వం రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు వదిలివెళ్లినా, సమయస్ఫూర్తితో రాష్ట్రాన్ని నడిపిస్తూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పాత పథకాలను కొనసాగిస్తూనే.. రైతు భరోసాను ఎకరాకు రూ. 12,000కు పెంచామని చెప్పారు.

గత పథకాలతో పాటు ప్రజా ప్రభుత్వం పలు అదనపు విప్లవాత్మక మార్పులు తెచ్చిందని సీఎం వివరించారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ. 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు 1,000 బస్సులు, బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 60,000 కోట్ల రుణాలు, మహిళలకు పండుగ సారెగా ఇందిరమ్మ చీరలు, ఏడాదిలోనే 67,717 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RevanthReddyTelanganaRythuBharosaFarmersFirstTelanganaFarmersKhammamCongressGovernmentFarmerWelfareAgricultureTelanganaDevelopment