
భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి
నగరంలోని ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేకతకు కళలు, సంస్కృతి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, కళాకారుల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గర్వించదగ్గ వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు తెలుగు భక్తి సాహిత్యంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించారని ఆయన అన్నారు. ఆయన కీర్తనలు భక్తి భావాన్ని మాత్రమే కాకుండా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సంగీత, నాట్య రంగాల ప్రోత్సాహానికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ ద్వారా వివిధ కళారూపాలను ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు. కళారూపాల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమాజానికి చేరవేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం చెప్పారు.
అదేవిధంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం సహా పురాతన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. కళలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సమాజంలో చైతన్యం కలిగించే శక్తివంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమం, సాంస్కృతిక వైభవ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
