
బ్యారెల్ ముడి చమురు @120 డాలర్లు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్‌కు ఏకంగా 119.50 డాలర్లకు చేరుకోగా, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) 119.48 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యుద్ధం ప్రారంభమైన రెండో వారంలోనే చమురు నిల్వలు, రవాణా మార్గాలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.
హోర్ముజ్ జలసంధి దిగ్బంధం.. స్తంభించిన రవాణా
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సుమారు 20 శాతం (రోజుకు 1.5 కోట్ల బ్యారెళ్లు) పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. అయితే ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల భయంతో ట్యాంకర్ల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. దీనివల్ల సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల నుంచి ఎగుమతులు స్తంభించిపోయాయి. ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో ఇరాక్, కువైట్ దేశాలు తమ చమురు ఉత్పత్తిని కూడా తగ్గించేశాయి.
ఇంధన కేంద్రాలే లక్ష్యం
ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దేశాలు పరస్పరం చమురు, గ్యాస్ నిల్వ కేంద్రాలపై దాడులు చేసుకుంటున్నాయి. ఆదివారం టెహ్రాన్‌లోని చమురు డిపోలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలుగురు మరణించగా, అపార నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్ కూడా బహ్రెయిన్‌లోని నీటి శుద్ధి ప్లాంట్లపై దాడులకు దిగింది. ఇరాన్ నుంచి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునే చైనా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది, ఇది ధరలు మరింత పెరగడానికి కారణమవుతోంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. పెరిగిన ద్రవ్యోల్బణం
చమురు ధరల పెరుగుదల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం జపాన్ నిక్కీ సూచీ ఏకంగా 7 శాతం పడిపోగా, అమెరికాలోని డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో గాలన్ పెట్రోల్ ధర వారం వ్యవధిలోనే 47 సెంట్లు పెరిగి 3.45 డాలర్లకు చేరింది. డీజిల్ ధర కూడా భారీగా పెరిగింది.
మధ్యప్రాచ్యం నుంచి వచ్చే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది.
భవిష్యత్తుపై నీలినీడలు
చమురు ధరలు 100 డాలర్ల పైన ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మాత్రం ఇవి తాత్కాలికమేనని, కొద్ది వారాల్లోనే ధరలు అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే చమురు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించడం గమనార్హం.
