
బుల్లెట్ ట్రైన్ ఖర్చులపై కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టిన ఎన్‌హెచ్ఎస్ఆర్సీఎల్
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఖర్చులు భారీగా పెరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్సీఎల్) గురువారం ఖండించింది. పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒప్పందాలు పూర్తిగా ఖరారైన తర్వాత ఖర్చుల అంచనాలను పునర్వ్యవస్థీకరించడం సాధారణ ప్రక్రియ అని సంస్థ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా ఖర్చుల అంచనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కూడా పేర్కొంది.
కాంగ్రెస్ కేరళ యూనిట్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందిస్తూ ఎన్‌హెచ్ఎస్ఆర్సీఎల్ ఈ వివరణ ఇచ్చింది. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో దాదాపు పది సంవత్సరాల క్రితం రూపొందించిన మొదటి ఖర్చు అంచనాలు ప్రాథమికంగా ఉండేవని తెలిపింది. అయితే డీటైల్ డిజైన్, ఇంజినీరింగ్, భూసేకరణ, నిర్మాణ ఒప్పందాలు ఖరారైన తర్వాత ఖర్చులను సవరించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రాజెక్టుల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ అని పేర్కొంది.
ఇక కాంగ్రెస్ కేరళ యూనిట్ ఒక మీడియా కథనాన్ని ఉదహరిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్లకు పెరిగిందని, భవిష్యత్తులో ఇది రూ.2.5 లక్షల కోట్లను దాటే అవకాశం ఉందని ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ దేశానికి భారంగా మారే “వైట్ ఎలిఫెంట్”గా మారిందని, అదనపు ఆర్థిక భారం భారతీయ రైల్వేలపై పడుతుందని విమర్శించింది.
ఈ ఆరోపణలను తిప్పికొట్టిన ఎన్‌హెచ్ఎస్ఆర్సీఎల్ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు నిర్ధారిత వాస్తవాలపై ఆధారపడలేదని తెలిపింది. ఎంపిక చేసిన సమాచారం ఆధారంగా తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. భారతదేశం, జపాన్ మధ్య కుదిరిన ఆర్థిక ఒప్పందం సమగ్రంగా ఉందని, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత సౌకర్యవంతమైన సార్వభౌమ రుణాల్లో ఇదొకటని సంస్థ వివరించింది.
అదనంగా, ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌ను ప్రత్యేక సంస్థ అయిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అమలు చేస్తోందని, దీనికి స్వంత ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వల్ల భారం భారతీయ రైల్వేలపై పడుతుందని చెప్పడం సరైంది కాదని సంస్థ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఖర్చులో సుమారు 80శాతం జపాన్ నుంచి తక్కువ వడ్డీ రుణంగా వస్తుండగా, మిగిలిన భాగాన్ని కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు భరిస్తున్నాయని సంస్థ స్పష్టం చేసింది.
హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచుతాయని సంస్థ పేర్కొంది. అలాగే విమాన ప్రయాణం హైవేల్లో ఉన్న రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని తెలిపింది. కారిడార్ వెంట ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దేశీయ తయారీ సామర్థ్యాల పెంపు వంటి అనేక ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యమవుతాయని వివరించింది.
బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తామని ఎన్‌హెచ్ఎస్ఆర్సీఎల్ హామీ ఇచ్చింది. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు 2017లో శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా 2029 నాటికి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
