Let's talk: editor@tmv.in
బీసీలకు రిజర్వేషన్లు కంటి తుడుపు చర్యే: కాంగ్రెస్‌

బీసీలకు రిజర్వేషన్లు కంటి తుడుపు చర్యే: కాంగ్రెస్‌

Pinjari Chand
21 ఆగస్టు, 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించడం కేవలం ‘కంటి తుడుపు చర్య’ అని ఏపీ కాంగ్రెస్‌ నేత కొలనుకొండ శివాజీ విమర్శించారు. ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తాన్ని రెండు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్ల అమలుకు కుల గణన, ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసి నివేదిక పొందడం వంటి ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుందని శివాజీ తెలిపారు. అనంతరం సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం, రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావడం, గవర్నర్‌ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం, హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతులు వంటి అనేక దశలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం రెండు నెలల సమయం సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు.

‘34 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం అర్థరహితం’

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం అర్థరహితమని శివాజీ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది కేవలం కంటి తుడుపు చర్యేనని అన్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏడాది క్రితమే దీనిని ప్రారంభించలేదని శివాజీ ఆరోపించారు. ఇప్పుడు బీసీలకు పెద్ద మేలు చేసినట్లుగా టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.

మూడు కులాలకే ప్రయోజనమా?

రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉన్నప్పటికీ ప్రయోజనాలు కేవలం మూడు కులాలకే అందుతున్నాయని శివాజీ ఆరోపించారు. బీసీలను వారి జనాభా ప్రాతిపదికన వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ప్రస్తుతం 25 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో బీసీ-ఏ, బీసీ-డీలకు చెరో 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం రిజర్వేషన్‌ ఉందని వివరించారు. అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇదే నిష్పత్తిలో అమలు చేయాలని, రాష్ట్రంలోని 2.69 కోట్ల బీసీ జనాభాకు ఈ విధానం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి

బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని శివాజీ కోరారు. ఇందుకోసం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతికి సంబంధించిన చట్టాలకు కల్పించిన తరహాలోనే బీసీ రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.

ఆగస్టు 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

బీసీలకు రిజర్వేషన్లు కంటి తుడుపు చర్యే: కాంగ్రెస్‌ - Tholi Paluku