
బీసీ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు.. మంత్రి రాజీనామా చేయాలి: బీజేపీ నేత ఆనంద్ గౌడ్
రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్ల దారుణమైన పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. ఆనంద్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని ఒక బీసీ గురుకుల విద్యార్థులు టీవీ ఇంటర్వ్యూలో తమ బాధలను చెప్పుకోవడం చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే గదిలో అన్ని తరగతులు నడవడం వల్ల ఎవరికి ఏ క్లాస్ చెప్తున్నారో అర్థం కాక, సరైన భోజనం, తాగునీరు లేక, బట్టలు ఉతుక్కునేందుకు కూడా వసతులు లేక పసిపిల్లలు నరకం అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
సొంత శాఖలోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను పాలమూరు బిడ్డనని, పులిని, సింహాన్ని అని గొప్పలు చెప్పుకుంటారని.. కానీ ఆయన సొంత పాలమూరు జిల్లాలోనే హాస్టళ్లను కోళ్ల ఫారాలలో నడిపిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ కుర్చీలను కాపాడుకోవడానికి, అంతర్గత కొట్లాటలను పరిష్కరించుకోవడానికే కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది తప్ప, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల జీవితాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాబోయే రెండు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని హాస్టళ్ల సమస్యలను పరిష్కరించి, పరిస్థితులను మెరుగుపరచకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
