Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

Pinjari Chand
19 జనవరి, 2026

26 ఏళ్లకే ఎమ్మెల్యే, 45 ఏళ్లకే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు—ఇది నితిన్ నబిన్ రాజకీయ ప్రస్థానంలోని అసాధారణ ఎదుగుదల. సోమవారం ఆయన బీజేపీ అతి పిన్న వయసు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నియామకం ద్వారా బీజేపీలో తరం మార్పునకు నాంది పలికినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లో ప్రొఫైల్‌లో ఉంటూ రాజకీయాల్లో ముందుకు సాగిన నితిన్ నబిన్, బీహార్‌లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ప్రస్తుతం ఆయన బీహార్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా కూడా ఉన్నారు. డిసెంబర్ 14న ఆయనను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. జేపీ నడ్డా తర్వాత పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారు అన్న ఉత్కంఠకు ఇది ముగింపు పలికింది. అలాగే ఈ నిర్ణయం, ఆర్‌ఎస్‌ఎస్‌తో బీజేపీకి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చలు జరుగుతున్న సమయంలో రావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది.

బీహార్ నుంచి తొలి జాతీయ అధ్యక్షుడు

బీజేపీ చరిత్రలో బీహార్ నుంచి తొలి జాతీయ అధ్యక్షుడు అయిన నబిన్, పార్టీని తమిళనాడు, కేరళ, అస్సాం వంటి కీలక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల వైపు నడిపించాల్సిన బాధ్యతను చేపట్టారు. ఏప్రిల్‌లో జరిగే ఈ ఎన్నికలు ఆయనకు పెద్ద పరీక్షగా నిలవనున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే నితిన్ నబిన్ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఆయన సందేశం సూటిగా, స్పష్టంగా ఉంటుంది. రాజకీయాలు 100 మీటర్ల పరుగు పందెం కాదు… ఇది దీర్ఘ మారథాన్. వేగం కంటే సహనం, స్థైర్యమే ముఖ్యం అనేది ఆయన పార్టీ కార్యకర్తలకు చెప్పే ప్రధాన మంత్రం.

బీహార్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సహా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు గెలవడమే మన లక్ష్యం కాదు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కాషాయ జెండా ఎగరవేయాలి. రాహుల్ గాంధీలా పార్ట్‌టైమ్ రాజకీయాలు చేయకండి. ఎన్నికల సమయంలో బీహార్ కి వచ్చి, తర్వాత జర్మనీలో సెలవులు గడపడం మాకు అలవాటు లేదని అస్సాంలో ఆయన మరోసారి స్పష్టం చేశారు. మేము ఎన్నికలు గెలవడానికి మాత్రమే ప్రజల వద్దకు వెళ్లం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే వారి మధ్య ఉంటామని తెలిపారు.

బీజేపీ యువ మోర్చా (భాజపా యువ విభాగం) నుంచి ఎదిగిన నితిన్ నబిన్‌కు ఈ రాబోయే రాష్ట్ర ఎన్నికలు సంస్థాగత నాయకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా మారనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబాటుతో పనిచేయాలని ఆయన తరచూ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నబిన్, తన తండ్రి నవీన్ కిశోర్ సిన్హా మరణం తర్వాత పాట్నా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్ నేత. ఆ సమయంలో నితిన్ నబిన్ చదువును మధ్యలోనే వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో ఆయనను రాజకీయాల్లో ‘బయట వ్యక్తి’గా చూశారు.

అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు

అయితే 20 ఏళ్ల తర్వాత నితిన్ నబిన్‌ను నేలపై నిలబడిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఆర్గనైజేషన్ మనిషిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఆయన బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ వర్గాల ప్రకారం కాయస్థ కులానికి చెందిన నబిన్ తక్కువ వయసులోనే పరిపాలన అనుభవం, ప్రజలతో పాటు పార్టీ కోసం పనిచేసే నిబద్ధత కలిగిన నేతగా ఎదిగారు. నవంబర్ 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్‌చార్జ్‌గా ఉన్న నబిన్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను ఓడిస్తూ బీజేపీకి అంచనాలకు మించిన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి, ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ గెలుచుకునేలా చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జన్మించిన నితిన్ నబిన్, దీప్మాలా శ్రీవాస్తవను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2006లో జరిగిన ఉపఎన్నికల్లో దాదాపు 60,000 ఓట్ల మెజారిటీతో తొలి విజయం, తాజాగా జరిగిన ఎన్నికల్లో 51,000కుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపు. ఇది ఆయన రాజకీయ బలం.

బీజేపీ అధ్యక్షుల పరంపరలో నితిన్ నబిన్ తాజాగా చేరిన నాయకుడు. 1980లో పార్టీ ఏర్పడిన తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి తొలి అధ్యక్షుడు కాగా, ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ మూడు పర్యాయాలు ఈ పదవిని నిర్వహించారు. మురళీ మనోహర్ జోషి, కుశాభౌ ఠాక్రే, బంగారు లక్ష్మణ్, జన కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్ (రెండుసార్లు), నితిన్ గడ్కరీ, అమిత్ షా ఈ పదవిని చేపట్టారు. జేపీ నడ్డా 2020 నుంచి ఈ బాధ్యతలు నిర్వహించారు.

37 సెట్ల నామినేషన్ పత్రాలు

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీలో నితిన్ నబిన్ ఏకైక అభ్యర్థిగా నిలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్‌కు మద్దతుగా మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని, వాటన్నింటినీ పరిశీలించిన తరువాత అవి సరైనవిగా, చెల్లుబాటయ్యేవిగా గుర్తించామని సీనియర్ బీజేపీ నాయకుడు, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కే. లక్ష్మణ్ సోమవారం తెలిపారు. నితిన్ నబిన్ అభ్యర్థిత్వానికి ప్రతిపాదకులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి పలువురు సీనియర్ నేతలు ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తయిందని ఆయన చెప్పారు.

మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు నితిన్ నబిన్‌కు అనుకూలంగా అందాయి. పరిశీలనలో అన్ని పత్రాలు నిర్దిష్ట ఫార్మాట్‌లో సక్రమంగా దాఖలైనవని నిర్ధారించాం. ఉపసంహరణ గడువు పూర్తయ్యాక, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఒక్కరే ప్రతిపాదిత అభ్యర్థిగా ఉన్నారని పేర్కొన్నారు. దాఖలైన 37 సెట్ల నామినేషన్ పత్రాలలో, 36 సెట్లు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చాయి, వీటిలో ప్రతి సెట్లో 20 మంది పార్టీ నాయకుల సంతకాలు ఉన్నాయి. మిగిలిన ఒక సెటు నామినేషన్ పత్రాన్ని ప్రధానమంత్రి సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, 37 మంది ఎంపీలు ప్రతిపాదించారని లక్ష్మణ్ తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ - Tholi Paluku