Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బీఎల్వోలపై ఒత్తిడి తగ్గించండి:సుప్రీంకోర్టు

బీఎల్వోలపై ఒత్తిడి తగ్గించండి:సుప్రీంకోర్టు

Pinjari Chand
4 డిసెంబర్, 2025

బీఎల్వోలపై ఒత్తిడి తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు సిబ్బందిని నియమించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. ఎన్నికల ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్) పనుల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కోంటూ నటుడు విజయ్ పార్టీ తమిళ వెట్రి కళగం (టీవీకే) దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

బీఎల్వోలు (ఎక్కువగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు) ఈ పని ఒత్తిడితో కొందరు మరణించారని, విధులు సకాలంలో పూర్తి చేయని బీఎల్వోల పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని టీవీకే తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు.

బీఎల్వోల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలి

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఉద్యోగులను డెప్యూట్ చేయడం ద్వారా బీఎల్వోల పని గంటలను తగ్గించాలని కోర్టు సూచించింది. వారి రెగ్యులర్ విధులతోపాటు ఎన్నికల కమిషన్ అదనపు బాధ్యతల వల్ల ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఇబ్బందులను తొలగించాలని ధర్మాసనం పేర్కొంది. ఏదైనా ఉద్యోగికి ఎస్ఐఆర్ విధుల నుంచి మినహాయింపు కావాలంటే కేస్ టు కేస్ ఆధారంగా పరిశీలించి, ప్రత్యామ్నాయ ఉద్యోగిని పెట్టే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రత్యామ్నాయం లేకుండా ఇప్పటికే నియమించిన ఉద్యోగులను వెనక్కి తీసుకోరాదని హెచ్చరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలు తప్పనిసరిగా అవసరమైన సిబ్బందిని ఎన్నికల కమిషన్‌కు సహాయంగా నియమించాలని, అయితే ఆ సంఖ్యను పెంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని కోర్టు తెలిపింది. విధుల్లో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం వంటి ఇతర సాయం తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. విచారణలోఒక యువకుడు పెళ్లికి సెలవు కావాలని అడిగితే నిరాకరించి సస్పెండ్ చేశారని, ఆత్మహత్య చేసుకున్నాడని శంకరనారాయణన్ ఉదాహరణ ఇచ్చారు. కనీసం మానవత్వం చూపించండి. క్రిమినల్ చర్య కఠినమని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో 2027లోనే ఎన్నికలు కానీ ఇప్పుడే గడువు విధిస్తున్నారని సీజేఐ ఉదాహరించారు.

ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు రాకేష్ ద్వివేది, మనీందర్ సింగ్ తమిళనాడులో 90 శాతం కంటే ఎక్కువ ఫారాల సేకరణ పూర్తయింది. విధులు చేయడానికి నిరాకరిస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామని వాదించారు.

నవంబర్ 30న ఎన్నికల కమిషన్ 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను ఒక వారం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్. వీటిలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బంగాల్‌లో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంలో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

బీఎల్వోలపై ఒత్తిడి తగ్గించండి:సుప్రీంకోర్టు - Tholi Paluku