
బిర్యానీ ప్రియులకు షాక్.. ‘షాదాబ్’ హోటల్ లైసెన్స్ సస్పెండ్!
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో గల అత్యంత ప్రసిద్ధ బిర్యానీ సెంటర్'హోటల్ షాదాబ్' లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వంటి ఉల్లంఘనలు గుర్తించడంతో షాదాబ్ హోటల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చట్టం కింద హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
బుధవారం హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మొత్తం తొమ్మిది ప్రత్యేక బృందాలు 19 కేఫ్‌లు, హోటళ్లను తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా పలు చోట్ల పాడైన ఆహార పదార్థాలు, మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, తెరిచి ఉంచిన చెత్త డబ్బాలు, ఈగలు, బొద్దింకలు వంటి అపరిశుభ్ర పరిస్థితులను అధికారులు గుర్తించారు. కొందరు సిబ్బంది తల కవర్లు కూడా ధరించకపోవడం బయటపడింది.
నిబంధనలకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యే ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో డ్రీమ్జ్ కేఫెటీరియా, ఏషియాటిక్ కేఫ్‌లను అధికారులు మూసివేశారు. మరో 12 ఆహార కేంద్రాలకు పరిస్థితులను మెరుగుపర్చుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఐదు సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తనిఖీల సందర్భంగా మొత్తం 15 ఆహార నమూనాలను సేకరించి కల్తీ పరీక్షలకు పంపించారు. ఈగలు పడినట్లు గుర్తించిన పాడైపోయే ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే తొలగించి పారవేశారు. నిబంధనల అమలును పరిశీలించేందుకు తదుపరి దశలోనూ తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
షాదాబ్‌పై చర్యల విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హోటల్ రెగ్యులర్ కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ హోటల్ త్వరగా లోపాలను సరిదిద్దుకుని తిరిగి పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
