Let's talk: editor@tmv.in
బాన్సువాడ ఆసుపత్రి ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి హరీష్‌‌రావు
బాన్సువాడ ఆసుపత్రి ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి హరీష్‌‌రావు

బాన్సువాడ ఆసుపత్రి ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి హరీష్‌‌రావు

Gaddamidi Naveen
21 జులై, 2026

బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్సల అనంతరం పలువురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలింతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 13న బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ చేసిన 10 మంది మహిళలకు ఇన్ఫెక్షన్ సోకగా, వారిని తొలుత నిజామాబాద్ ఆసుపత్రికి, అనంతరం నిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. తెల్ల రక్త కణాలు తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వ్యాపించి ఐసీయూలో డయాలసిస్‌పై చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగి పది రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు ఏ మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బాధితులను పరామర్శించలేదని, పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశాలు ఇవ్వలేదని ఆరోపించారు.

ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో లోపాలు, వైద్యుల నిర్లక్ష్యం, కాలం చెల్లిన మందుల వినియోగంపై బాధిత కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. తొలి ఆరుగురికి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినప్పటికీ, అదే ఆపరేషన్ థియేటర్లో మరో నలుగురికి సిజేరియన్ చేయడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతాన్ని 30-35శాతం నుంచి 72 శాతానికి పెంచగా, ప్రస్తుత నిర్లక్ష్యం వల్ల అది మళ్లీ 50 శాతానికి పడిపోయిందని, సి-సెక్షన్ (సిజేరియన్) రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాతృ మరణాల రేటును 92 నుంచి 43కు తగ్గించి తెలంగాణను దేశంలోనే మూడో ఉత్తమ రాష్ట్రంగా నిలిపామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో రెగ్యులర్ సూపర్ విజన్, జవాబుదారితనం లోపించాయని, మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు. "ఇందిరమ్మ పాలన" అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిలిపివేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు.

తల్లులకు సోకిన ఇన్ఫెక్షన్ పాల ద్వారా పసిపిల్లలకు కూడా చేరి, వారు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి వైద్య సహాయం అందించడంతో పాటు తగిన ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా, ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనలో కూడా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని హరీష్ రావు విమర్శించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
HarishRaoBRSTelanganaBanswadaGovernmentHospitalPublicHealthHealthcareNIMSMedicalNegligenceJusticeForPatients
బాన్సువాడ ఆసుపత్రి ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి హరీష్‌‌రావు - Tholi Paluku