
బంగ్లాదేశ్‌లో ఇంధన కటకట.. వర్సిటీలు బంద్
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను తీవ్ర ఇంధన సంక్షోభంలోకి నెట్టాయి. విద్యుత్, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలన్నింటినీ సోమవారం నుంచే మూసివేశారు. వాస్తవానికి ఈ నెల చివర్లో రావాల్సిన రంజాన్ (ఈద్) సెలవులను ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 10 రోజుల ముందుగానే ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలన్నీ నిన్నటి నుంచే మూతపడ్డాయి. విద్యాసంస్థల బంద్ వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, వాహనాల రద్దీ తగ్గి ఇంధనం వృథా కాకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి
విశ్వవిద్యాలయాల్లోని తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గృహాల్లో ఏసీలు, ఇతర అవసరాల కోసం భారీగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ భారాన్ని తగ్గించేందుకు విద్యాసంస్థల మూసివేత అనివార్యమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రంజాన్ సందర్భంగా పాఠశాలలు మూతపడగా, తాజాగా వర్సిటీలు, విదేశీ స్కూళ్లు, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కూడా నిన్నటి నుంచి కార్యకలాపాలను నిలిపివేశాయి.
దిగుమతులపై దెబ్బ
తమ ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడే బంగ్లాదేశ్‌కు, మధ్యప్రాచ్యం నుంచి సరఫరా నిలిచిపోవడం పెద్ద దెబ్బగా మారింది. మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. గ్యాస్ కొరత తీవ్రమవ్వడంతో దేశంలోని ఐదు ప్రభుత్వ రంగ ఎరువుల కర్మాగారాల్లో నాలుగింటిని ఇప్పటికే మూసివేశారు. అక్కడ వాడాల్సిన గ్యాస్‌ను అత్యవసరంగా విద్యుత్ ప్లాంట్లకు మళ్లిస్తున్నారు. ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని నిల్వ చేస్తుండటంతో, గత శుక్రవారం నుంచే ఇంధన విక్రయాలపై ప్రభుత్వం రోజువారీ పరిమితులను (రేషన్) విధించింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారమనే తెలిసినా అత్యధిక ధరలకు ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేస్తోంది.
పొదుపు చర్యలే ఏకైక మార్గం
విద్యుత్, ఇంధన సరఫరాలో స్థిరత్వం రావాలంటే వినియోగాన్ని తగ్గించుకోక తప్పదని బంగ్లాదేశ్ ఇంధన శాఖ సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడకుండా ఉండేందుకు పకడ్బందీగా పొదుపు చర్యలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ యుద్ధ వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే పరిస్థితి ఇంకా చేయిదాటిపోయే ప్రమాదం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
