Let's talk: editor@tmv.in
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: రామచందర్‌రావు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: రామచందర్‌రావు

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆందోళన చేపట్టింది. కరీంనగర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుతో పాటు పార్టీ నాయకులు, వేలాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మిగిల్చి వెళ్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధుల విడుదలలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. బకాయిలు అందక కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని విద్యాసంస్థలు మూతపడే దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్, ఆయుష్, యూనివర్సిటీ తదితర విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న ప్రతి రూపాయి విడుదల చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

'వందేమాతరం'పై కాంగ్రెస్ తీరుపై ధ్వజం

అలాగే ‘వందేమాతరం’పై కాంగ్రెస్ వైఖరిని రామచందర్‌రావు విమర్శించారు. 1937లోనే కాంగ్రెస్ పార్టీ 'వందేమాతరం' గీతాన్ని విభజించి దేశ విభజనకు పునాది వేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భారతదేశంతో, భారతీయ సంస్కృతితో, జీవన విలువలతో, సంప్రదాయాలతో నిజమైన అనుబంధం ఎన్నడూ లేదని, ఇప్పుడు సంపూర్ణ వందేమాతరం ఆలాపనను వ్యతిరేకించడం అంటే భారతమాతను అవమానించడమే. దీనిని దేశం ఎన్నటికీ క్షమించదని రామచందర్‌రావు పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: రామచందర్‌రావు - Tholi Paluku