Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు

Pinjari Chand
1 మార్చి, 2026

ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగి రూ.1.83 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. దిగుమతులపై ఆదాయం పెరగడం, దేశీయ విక్రయాల్లో మెరుగుదల దీనికి కారణమని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. దేశీయ స్థూల ఆదాయం 5.3 శాతం పెరిగి సుమారు రూ.1.36 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై ఆదాయం 17.2 శాతం ఎగిసి రూ.47,837 కోట్లకు చేరింది. మొత్తం రిఫండ్లు 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లుగా నమోదయ్యాయి. నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లకు పైగా ఉండగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 7.9 శాతం అధికం. అయితే నికర సెస్ ఆదాయం రూ.5,063 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.13,481 కోట్లుగా ఉంది.

2025 సెప్టెంబర్ నుంచి సుమారు 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో పాటు, 5శాతం, 12, 18, 28శాతం అనే నాలుగు పన్ను శ్లాబ్‌లను విలీనం చేసి 5,18శాతంగా రెండు ప్రధాన శ్లాబ్‌లు అమలు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై గరిష్ఠంగా 40శాతం శ్లాబ్ కొనసాగుతోంది. రేట్ల కోత అమలు తర్వాత నవంబర్‌లో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లకు తగ్గినా, డిసెంబర్‌లో రూ.1.74 లక్షల కోట్లకు, జనవరిలో రికార్డు స్థాయిలో రూ.1.93 లక్షల కోట్లకు పెరిగాయి.

పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం, వినియోగంలో పెరుగుదల రేట్ల కోత ప్రభావాన్ని సమతుల్యం చేసిందని పేర్కొన్నారు. అయితే తమిళనాడు (-6శాతం), మధ్యప్రదేశ్ (-8శాతం), రాజస్థాన్ (-1శాతం) వంటి రాష్ట్రాల్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం, పశ్చిమ బెంగాల్ (1శాతం), హర్యానా (2శాతం), ఉత్తరప్రదేశ్ (5శాతం), మహారాష్ట్ర (6శాతం) వంటి రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ వృద్ధి కనిపించడం ఆందోళనకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.20.27 లక్షల కోట్లకు చేరి 8.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇది పన్ను వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు - Tholi Paluku