Let's talk: editor@tmv.in
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడే రోజొస్తుంది.. హోస్టింగ్ కూడా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడే రోజొస్తుంది.. హోస్టింగ్ కూడా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
20 జులై, 2026

భారత ఫుట్‌బాల్ జట్టు ఒకరోజు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడటమే కాకుండా, భవిష్యత్తులో ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం (హోస్టింగ్) కూడా ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ జట్ల మధ్య జరగబోయే 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫుట్‌బాల్ సందడితో పీక్స్‌కు చేరింది. ఈ తరుణంలో ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఫుట్‌బాల్‌పై తనకున్న మక్కువను, భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుపై తనకున్న సుదూర దార్శనికతను పంచుకున్నారు.

తెలంగాణ నుంచే భవిష్యత్ స్టార్లు

నేను క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్‌ను ఎంతగానో ప్రేమిస్తాననే విషయం మీలో చాలా మందికి తెలుసు. గతంలో ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, తెలంగాణ పిల్లలతో కలిసి మైదానాన్ని పంచుకునేలా చేసిన రోజు నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే, ఫిఫా ప్రపంచకప్‌నకు నేను మద్దతు ఇవ్వడం వెనుక ఒక లోతైన ఉద్దేశం, దార్శనికత ఉన్నాయి. ఒకరోజు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడటంతో పాటు, దానికి మన దేశమే ఆతిథ్యం ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. నా మాట గుర్తుపెట్టుకోండి, ఆనాటి భవిష్యత్ యువ ఫుట్‌బాల్ స్టార్లలో చాలా మంది మన తెలంగాణ నుంచే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తూ అభిమానులందరూ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించండని సీఎం రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.

ఫిఫా ఫైనల్స్ కోసం తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు

ఇదిలా ఉండగా, ఆదివారం అర్ధరాత్రి ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు వీక్షించేందుకు వీలుగా.. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, కేఫ్‌లలో లైవ్ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. మ్యాచ్ ముగిసే వరకు వీటిని తెరిచి ఉంచేందుకు వీలు కల్పించారు. నూతన సంవత్సర వేడుకల తరహాలోనే భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఉత్సాహం ఉరకలేస్తోంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ పిల్లర్లపై లియోనెల్ మెస్సీ, భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రిల ఫుట్‌బాల్ నేపథ్య కుడ్యచిత్రాలు (మురాల్స్) నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో సోమవారం తెల్లవారుజామున జరగనున్న ఈ చారిత్రాత్మక ఫైనల్ పోరులో.. టోర్నీ పొడవునా కేవలం ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుని, 37 మ్యాచ్‌ల అజేయ రికార్డుతో దూసుకుపోతున్న స్పెయిన్ జట్టుతో, టోర్నమెంట్‌లో అత్యధిక లేట్ గోల్స్ (85వ నిమిషం తర్వాత 8 గోల్స్) చేసిన రికార్డుతో వరుసగా రెండోసారి కప్ గెలవాలని చూస్తున్న అర్జెంటీనా తలపడనుంది. ఈ పోరుపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ట్యాగ్‌లు
RevanthReddyTelanganaFIFAWorldCupFIFAFinalIndianFootballFootballHyderabadTelanganaFootballLionelMessiSunilChhetriSportsFootballFansWorldCupFinalIndia