Let's talk: editor@tmv.in
ప్రైవేట్ బస్సుల పన్ను తగ్గింపు: కూటమి ప్రభుత్వానికి ఘనంగా ‘కృతజ్ఞత సభ’

ప్రైవేట్ బస్సుల పన్ను తగ్గింపు: కూటమి ప్రభుత్వానికి ఘనంగా ‘కృతజ్ఞత సభ’

Gaddamidi Naveen
15 జులై, 2026

అంతరాష్ట్ర టూరిస్ట్ ప్రైవేట్ బస్సులపై ప్రస్తుతం అమలులో ఉన్న పన్నును రూ. 4,000 నుంచి రూ. 2,500 వరకు తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని సృజన కళ్యాణ అవెన్యూలో ఘనంగా ‘కృతజ్ఞత సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ బస్సుల పన్ను మినహాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా పరిష్కరించని ఈ సమస్యను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంతో సునాయాసంగా పరిష్కరించారని కొనియాడారు. ఈ విజయం వెనుక మంత్రి చేసిన నిరంతర కృషి ఎనలేనిదని వారు అభినందించారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రవాణా రంగ అభివృద్ధి, భద్రతకు కూటమి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలు, సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ పన్ను తగ్గింపును సాధించామని వివరించారు. రవాణా రంగంలో ఉన్న మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రైవేట్ ఆపరేటర్ల సౌకర్యార్థం 'బివోటి' విధానంలో ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రయాణికుల రవాణా భద్రతపై ఆపరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అనంతరం ఈ వేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు అసోసియేషన్ నూతన లోగోను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ విజయవంతమైన కృతజ్ఞత సభలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్, రవాణా రంగ ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రైవేట్ బస్సుల యజమానులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPNewsPrivateBusesBusOperatorsTransportSectorRoadTransportAndhraUpdatesChandrababuNaiduRamprasadReddyAPGovernment
ప్రైవేట్ బస్సుల పన్ను తగ్గింపు: కూటమి ప్రభుత్వానికి ఘనంగా ‘కృతజ్ఞత సభ’ - Tholi Paluku