Let's talk: editor@tmv.in
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థికి 'మతపరమైన హోంవర్క్'.. టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థికి 'మతపరమైన హోంవర్క్'.. టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

Gaddamidi Naveen
18 జులై, 2026

నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హిందూ విద్యార్థికి "ఇస్లామిక్ మతపరమైన పద్ధతులను" హోంవర్క్‌గా కేటాయించారనే ఆరోపణలపై ఒక ఉపాధ్యాయురాలితో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

బాధిత విద్యార్థి పిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ జోన్ పోలీసులు సదరు టీచర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 299 (మతపరమైన భావాలను దెబ్బతీసే ఉద్దేశపూర్వక చర్యలు), జువైనల్ జస్టిస్ యాక్ట్ లోని సెక్షన్ 75 (పిల్లలపై క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో పాఠశాల యాజమాన్యం సదరు ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించింది.

అసలేం జరిగిందంటే?

చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 15న ఒక మహిళా టీచర్ రెండో తరగతి విద్యార్థులందరికీ 'కల్మా' చదవాలని హోంవర్క్ ఇచ్చారు. ఆ తరగతిలోని మొత్తం 25 మంది విద్యార్థులలో కేవలం ఒక్కరు మాత్రమే హిందూ విద్యార్థి ఉన్నారు. విద్యార్థులందరికీ 'కల్మా' చదవాలని ఆదేశించడం విద్యా విధానంతో పాటు పాఠశాల నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని డీసీపీ స్పష్టం చేశారు.

ఆరు సంవత్సరాల ఆ హిందూ బాలుడి డైరీలో ముస్లిం మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలను హోంవర్క్‌గా రాయడాన్ని బాలుడి పిన్ని గమనించారు. దీనిపై ఆమె పాఠశాలకు వెళ్లి నిలదీయగా.. పాఠశాల ప్రిన్సిపాల్ ఇది అందరు విద్యార్థులకూ తప్పనిసరి అని సమాధానం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. మతపరమైన హోంవర్క్‌లు కేవలం ఇష్టపూర్వకంగా ఎంచుకున్న వారికే ఇవ్వాలని, అందరిపై రుద్దడం తగదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై తప్పుడు లౌకికవాద సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని ఆయన ప్రశ్నించారు. ఇది మత స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం సదరు పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, అప్పుడు హిందూ విద్యార్థులందరికీ 'తిలకం' ధరించడాన్ని తప్పనిసరి చేస్తామని వ్యాఖ్యానించారు.

మరోవైపు వీహెచ్‌పీ నేత రావినూతల శశిధర్ స్పందిస్తూ.. సదరు విద్యాసంస్థ గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు
HyderabadNewsTelanganaNewsSchoolControversyEducationNewsmHomeworkRowHyderabadTelanganaStudentRightsSchoolEducationReligiousFreedomBandiSanjay
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థికి 'మతపరమైన హోంవర్క్'.. టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు - Tholi Paluku