
ప్రారంభమైన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
రాష్ట్రంలో శుక్రవారం నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 కార్యాచరణ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తోందని అన్నారు.అర్హులైన లబ్ధిదారులు ఇంకా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా మిగిలి ఉంటే వారిని గుర్తించి వెంటనే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అమలులో ఎక్కడైనా లోపాలు ఉంటే నిర్లక్ష్యం లేకుండా సరిదిద్దాలని ఆయన సూచించారు.
ఇదే సందర్భంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పరిపాలనపై ప్రజల్లో మంచి పేరు పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’: మహిళా శక్తికి మంత్రి పొన్నం ప్రాధాన్యం
హైదరాబాద్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు కార్యక్రమాలను హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని చాచా నెహ్రూ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నగరంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన మిర్రర్ లైబ్రరీని కూడా ఆయన ప్రారంభించారు. అలాగే మహిళల సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి కాంటీన్ను ప్రారంభించారు. మహిళల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.35 కోట్ల విలువైన జీరో వడ్డీ రుణాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని ఆర్థికంగా మరింత బలపడతారని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.
నెరడిగొండలో స్పెషలిస్ట్ వైద్య శిబిరం: ప్రారంభించిన మంత్రి జూపల్లి
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను వారి ముంగిటకే చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నెరడిగొండలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
గతంలో నిపుణుల వైద్యం కోసం ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నేరుగా పీహెచ్‌సీల వద్దకే స్పెషలిస్ట్ డాక్టర్లను పంపిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై మంత్రి ఆరా తీశారు.
ప్రజా పాలన పథకాల అమలులో మెదక్ జిల్లా నంబర్ వన్‌గా ఉండాలి: మంత్రి వివేక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, ప్రజా పాలన పథకాల అమలులో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యా మౌలిక సదుపాయాలు, సోలార్ లైటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా సింగూర్ ప్రాజెక్టులో డీ-సిల్టింగ్ పనులను వేగవంతం చేసి వేసవి తాగునీటి ఎద్దడిని నివారించాలని, అమృత్ పథకం ద్వారా కేంద్ర నిధులను రాబట్టాలని అధికారులను కోరారు. రాబోయే 30-40 రోజుల్లో పనుల పురోగతిని మరోసారి సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
