
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కుమారస్వామి
ఎన్డీయే ప్రభుత్వం రైతు సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్నారు. బెంగళూరులోని యలహంకలో ఉన్న జాతీయ వ్యవసాయ కీటక వనరుల బ్యూరో 33వ స్థాపన దినోత్సవం సందర్భంగా మూడో వ్యవసాయ కీటక జీవ నియంత్రణ ఎక్స్‌పో కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే, బెంగళూరు గ్రామీణ ఎంపీ సి.ఎన్. మంజునాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ రైతులు వరితో పాటు పప్పుదినుసు పంటలను ఎక్కువగా సాగు చేయాలని సూచించారు. దీంతో పప్పుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందని, వ్యవసాయ రంగంలోని ప్రతి విభాగానికి మద్దతు ఇస్తోందని తెలిపారు. రసాయన కీటకనాశకాలు నేల సారాన్ని తగ్గిస్తాయని, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మరింతగా దృష్టి పెట్టాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోని ఐదు ఆర్థిక అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలిచిందన్నారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని వివరించారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది; మంత్రి శోభాకరంద్లాజే
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ పూర్వ తరాల రైతులకు పంటలకు అనుకూలమైన కీటకాలపై ఎక్కువ అవగాహన ఉండేదని, ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఆధునిక రైతులకు చేరవేస్తున్నామని చెప్పారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆరోగ్యకరమైన, రసాయనరహిత పంటలు పండిస్తేనే ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకోగలరని ఆమె అన్నారు. ఎంపీ సి.ఎన్. మంజునాథ్ మాట్లాడుతూ మన ఆరోగ్యం పంటల నాణ్యతపై, నేల సారంపై ఆధారపడి ఉంటుంది. జీవ పద్ధతులను అవలంబించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన రైతులు, ఐసీఏఆర్–ఎన్‌బిఏఐఆర్ శాస్త్రవేత్తలను సత్కరించారు. సంస్థ డైరెక్టర్ ఎస్.ఎన్. సుశీల్ పలువురు అధికారులు ఈ సందర్భంగా హాజరయ్యారు.